
రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ క్రమంలో నవంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలం హకీంపేటలో భారీ స్థాయిలో మెగా రైతుమేళా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
హైదరాబాద్, నవంబర్ 6: వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. శుక్రవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రైతులకు మేలు చేయడం, వారి ఆదాయాన్ని పెంచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వివరించారు.
ఈ లక్ష్యంలో భాగంగా హకీంపేటలో మూడు రోజుల పాటు మెగా రైతుమేళాను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. నవంబర్ 7న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు.
నవంబర్ 8న స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలతో సీఎం ప్రత్యేకంగా సమావేశమవుతారని మంత్రి వెల్లడించారు. ఇక నవంబర్ 9న పది జిల్లాల నుంచి తరలివచ్చే సుమారు 50 వేల మంది రైతులతో నిర్వహించే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారని వివరించారు.
రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించడంతో పాటు వ్యవసాయ రంగ అభివృద్ధికి ఈ రైతుమేళా దోహదపడుతుందని మంత్రి తుమ్మల ఆశాభావం వ్యక్తం చేశారు.
