
D Educt: Nov 6: సైనిక్ స్కూళ్లలో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
అన్నమయ్య జిల్లా కలికిరి, విజయనగరం జిల్లా కోరుకొండ సైనిక్ స్కూళ్లలో 2027-28 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరో, తొమ్మిదో తరగతుల్లో ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నోటిఫికేషన్ విడుదల చేసింది. జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్ష నిర్వహించి, అర్హత సాధించిన విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనున్నారు.
దరఖాస్తు గడువు
ఈ ప్రవేశాలకు మంగళవారం నుంచి డిసెంబర్ 2వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేయలేని అభ్యర్థులు రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 6వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చని ఎన్టీఏ వెల్లడించింది.
జనవరి 31న ప్రవేశ పరీక్ష
సైనిక్ స్కూళ్లలో ప్రవేశాల కోసం 2027 జనవరి 31న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. జనవరి 25 నుంచి అభ్యర్థులు హాల్టికెట్లను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు 150 నిమిషాలు, తొమ్మిదో తరగతి ప్రవేశ పరీక్షకు 180 నిమిషాల సమయం కేటాయించారు.
12 నగరాల్లో పరీక్షా కేంద్రాలు
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, విజయవాడ నగరాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు నిర్ణీత గడువులోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
