
వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన ఓ మహిళ.. ప్రియుడితో కలిసి అతడిని హత్య చేసిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సంచలనం సృష్టించింది. ఈ కేసులో మృతుడి భార్య, ఆమె ప్రియుడి పాత్ర ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భూపాలపల్లి మండలం గొల్లబుద్ధారం (చిలకపల్లి) గ్రామానికి చెందిన అజ్మీరా చందు నాయక్ (39) హత్యకు గురయ్యాడు. ఈ హత్య వెనుక అతడి భార్య పావని, ఆమె ప్రియుడు ధరావత్ సంతోష్ ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలినట్లు సమాచారం.
పోలీసుల వివరాల ప్రకారం.. పావనికి ధరావత్ సంతోష్‌తో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ విషయం తెలుసుకున్న చందు నాయక్ భార్యతో తరచూ గొడవపడేవాడు. తమ సంబంధానికి భర్త అడ్డుగా మారాడని భావించిన పావని, ప్రియుడితో కలిసి అతడిని హత్య చేయాలని కుట్ర పన్నినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో మూడు రోజుల క్రితం గ్రామంలో పంచాయతీ నిర్వహించాలని నిర్ణయించారు. తన భార్య వ్యవహారంపై పంచాయతీ పెట్టాలని చందు నాయక్ స్థానిక సర్పంచ్‌ను ఆశ్రయించాడు. శుక్రవారం పంచాయతీ నిర్వహించేందుకు సమయం కూడా ఖరారైంది. అయితే, తమ వివాహేతర సంబంధం బయటపడుతుందనే భయంతో పావని, సంతోష్ ముందుగానే హత్యకు పథకం వేసినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటిగంట సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న చందు నాయక్‌పై దాడి చేసి హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది. అనంతరం మృతదేహాన్ని ఎడ్లబండిపై తీసుకెళ్లి చిలకపల్లి గ్రామ శివారులో పడేసినట్లు తెలిసింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. భూపాలపల్లి డీఎస్పీ ఏ. సంపత్ రావు, సీఐలు శ్రీనివాస్, కరుణాకర్ రావు, ఎస్సై పవన్ సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
విచారణలో మృతుడి భార్య పావని, ఆమె ప్రియుడు సంతోష్‌పై అనుమానాలు రావడంతో పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. హత్యకు ఉపయోగించిన వస్తువులు, ఇతర ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు. ఈ నేరంలో మరెవరైనా పాల్గొన్నారా అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
