Old City Metro Project Faces Land Acquisition Hurdles; Construction Delayed Despite Two Years

హైదరాబాద్ ఓల్డ్ సిటీ మెట్రో రైలు ప్రాజెక్టుకు భూసేకరణ ప్రధాన అడ్డంకిగా మారింది. ప్రాజెక్టును ప్రకటించి రెండేండ్లు గడుస్తున్నా ఇప్పటికీ భూసేకరణ ప్రక్రియ పూర్తి కాలేదు. దీంతో నిర్మాణ పనుల ప్రారంభంలో తీవ్ర జాప్యం నెలకొంటున్నది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.

భూసేకరణలో చిక్కులు

సిటీబ్యూరో, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): ఓల్డ్ సిటీ మెట్రో విస్తరణ పనులకు అవసరమైన భూమి, ఆస్తుల సేకరణ ప్రక్రియ ఇంకా కొలిక్కి రాలేదు. హైదరాబాద్ మెట్రోకు కొత్త మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలు చేపట్టినప్పటికీ ప్రాజెక్టు అమలులో సమస్యలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మతపరమైన నిర్మాణాలు, ప్రైవేటు ఆస్తుల సేకరణ విషయంలో వివాదాలు తలెత్తుతున్నాయి. కొన్ని భూ సంబంధిత వివాదాలు న్యాయస్థానాల పరిధిలో ఉండటంతో సమస్యల పరిష్కారం మరింత ఆలస్యమవుతున్నది.

250కిపైగా ఆస్తుల సేకరణ పెండింగ్

ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు సుమారు 7.5 కిలోమీటర్ల మేర ఓల్డ్ సిటీ మెట్రో మార్గాన్ని నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రాజెక్టు కోసం 800కు పైగా ఆస్తులను అధికారులు గుర్తించారు. వీటిలో 250కిపైగా ఆస్తులను సేకరించాల్సి ఉంది. అయితే మిగిలిన ఆస్తులకు సంబంధించి భూ వివాదాలు, ఇతర సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో భూసేకరణ ప్రక్రియ ముందుకు సాగడం లేదు.

మరింత జాప్యం తప్పదా?

ఓల్డ్ సిటీ అభివృద్ధికి ఎంతో కీలకమైన మెట్రో ప్రాజెక్టును త్వరగా పూర్తి చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటిస్తున్నా, క్షేత్రస్థాయిలో పనులు మాత్రం ఆశించిన వేగంతో సాగడం లేదు. భూసేకరణ సమస్యలను పరిష్కరించడంలో జాప్యం కొనసాగితే నిర్మాణ పనుల ప్రారంభానికి మరో మూడు నెలల సమయం పట్టే అవకాశముంది. ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించి భూవివాదాలను పరిష్కరించకపోతే ప్రాజెక్టు మరింత ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *