
తెలంగాణలో రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. అదే ఇందిరమ్మ బీమా పథకం. కుటుంబ పెద్ద మరణిస్తే ఆ కుటుంబానికి రూ.5 లక్షల బీమా పరిహారం అందించేలా ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించింది. ఈ పథకం కోసం లబ్ధిదారులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే భరించనుంది.
నవంబర్ 19న పథకం ప్రారంభం
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నవంబర్ 19న ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. సిద్దిపేటలో నిర్వహించనున్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.
ఈ పథకం ద్వారా కుటుంబ పెద్ద ఏ కారణంతో మరణించినా అర్హులైన కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల బీమా సొమ్ము అందించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే బీమా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కథనంలో పేర్కొన్నారు.
ఇంటింటికీ వెళ్లి దరఖాస్తుల స్వీకరణ
ఇందిరమ్మ బీమా పథకం అమలులో భాగంగా నవంబర్ 20 నుంచి 30వ తేదీ వరకు ఇందిరమ్మ కమిటీలు ఇంటింటికీ వెళ్లి దరఖాస్తులు స్వీకరించనున్నాయి. అనంతరం తహసీల్దార్లు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు దరఖాస్తులను పరిశీలించి అర్హులను గుర్తించనున్నారు. అర్హత కలిగిన కుటుంబాలను పథకం లబ్ధిదారులుగా చేర్చనున్నారు.
ప్రతి అర్హ కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా కవరేజీ కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. రేషన్ కార్డు ఉన్నవారు బీమా కోసం ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదని ప్రభుత్వం తెలిపినట్లు సమాచారం.
నవంబర్ 19 నుంచి ఇందిరమ్మ చీరల పంపిణీ
మరోవైపు నవంబర్ 19 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కూడా ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని జిల్లాలకు చీరలను పంపించినట్లు సమాచారం. పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
గతంలో బతుకమ్మ పండుగ సందర్భంగా చీరలు పంపిణీ చేసేవారు. అయితే తయారీలో జాప్యం కారణంగా ఈసారి పంపిణీ ఆలస్యమైనట్లు తెలుస్తోంది. ఈసారి వివిధ రంగుల్లో చీరలను తయారు చేయించినట్లు కథనం పేర్కొంది.
పేద, మధ్యతరగతి కుటుంబాలకు బీమా భరోసా
సాధారణంగా ప్రైవేటు జీవిత బీమా పాలసీలు తీసుకోవాలంటే ప్రీమియం చెల్లించడంతో పాటు కొన్ని సందర్భాల్లో ఆరోగ్య పరీక్షలు కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భారంగా మారుతుంది.
For more: Live Updates in DTV Digital
ఈ నేపథ్యంలో ఇందిరమ్మ బీమా పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు ఉచితంగా జీవిత బీమా రక్షణ కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. కుటుంబ పెద్దను కోల్పోయిన సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం కొంతమేర అండగా నిలవనుంది.
