
నమస్తే తెలంగాణ కథనంతో స్పందించిన గ్రామపంచాయతీ అధికారులు.. చేతిపంపునకు మరమ్మతులు చేయించిన సర్పంచ్ కళ్యాణి
చుంచుపల్లి, నవంబర్ 6: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం గౌతమ్పూర్ గ్రామంలోని స్మశాన వాటికలో నెలకొన్న సమస్యలపై నమస్తే తెలంగాణలో ప్రచురితమైన కథనానికి గ్రామపంచాయతీ అధికారులు స్పందించారు. స్మశాన వాటికలో నీటి సౌకర్యం లేక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన సర్పంచ్ కళ్యాణి వెంటనే చర్యలు చేపట్టారు. చాలాకాలంగా నిరుపయోగంగా ఉన్న చేతిపంపునకు మరమ్మతులు చేయించి తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చారు. అంతేకాకుండా పంపు చుట్టూ పెరిగిన పిచ్చిమొక్కలను సైతం తొలగించి పరిసరాలను శుభ్రం చేయించారు.
దీపావళి పండుగ సందర్భంగా సమాధుల వద్దకు వచ్చే కుటుంబాలతో పాటు, అంత్యక్రియల సమయంలో నీటి వసతి లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ చర్యతో కొంత ఊరట లభించింది. ప్రజా సమస్యను వెలుగులోకి తీసుకొచ్చిన నమస్తే తెలంగాణకు, వెంటనే స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకున్న సర్పంచ్ కళ్యాణికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.
అయితే స్మశాన వాటికకు వెళ్లే రహదారి పరిస్థితి ఇంకా మెరుగుపడాల్సి ఉందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. రహదారిపై సీసీ రోడ్డు నిర్మించి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని గ్రామపంచాయతీ అధికారులను కోరుతున్నారు.
