Telangana Congress Infighting: Minister Damodar Rajanarsimha Skips TPCC Inquiry, Cites CWC Status

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఢిల్లీలోని శాంగ్రిలా హోటల్‌లో మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు మధ్య చోటుచేసుకున్న వివాదం ఇంకా సద్దుమణగలేదు. ఇద్దరి మధ్య నెలకొన్న విభేదాలకు పరిష్కారం చూపేందుకు టీపీసీసీ నాయకత్వం ప్రయత్నించినప్పటికీ ఆశించిన ఫలితం కనిపించడం లేదు.

హైదరాబాద్: ఢిల్లీలో ఇటీవల మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు మధ్య చోటుచేసుకున్న ఘర్షణ కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదానికి ముగింపు పలికి, ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా ఇద్దరినీ విచారణ నిమిత్తం గాంధీ భవన్‌కు రావాలని ఆహ్వానించారు.

అయితే ఈ విచారణకు మంత్రి దామోదర రాజనర్సింహ హాజరుకాకపోవడం ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. తాను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) శాశ్వత సభ్యుడినని, అలాంటి తనను టీపీసీసీ అధ్యక్షుడు విచారణకు పిలవడం ఏమిటంటూ ఆయన తన సన్నిహితుల వద్ద అసహనం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మహేష్ కుమార్ గౌడ్ స్థాయిని ప్రస్తావిస్తూ ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఈ పరిణామాల నేపథ్యంలోనే దామోదర రాజనర్సింహ గాంధీ భవన్‌కు వెళ్లలేదనే చర్చ సాగుతోంది. మరోవైపు మంత్రి విచారణకు హాజరుకానప్పుడు తాను మాత్రమే ఎందుకు వెళ్లాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు కూడా గైర్హాజరైనట్లు తెలుస్తోంది.

ఇద్దరు నేతలు విచారణకు రాకపోవడంతో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు నిరాశే ఎదురైంది. సమస్యను పరిష్కరించేందుకు పిలిచిన సమావేశానికి ఇరువురూ దూరంగా ఉండటంతో ఆయన చేసేదేమీ లేక గాంధీ భవన్ నుంచి వెనుదిరిగినట్లు సమాచారం. దీంతో తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *