
కొత్తగూడెం: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యనే ఓ ఏఆర్ కానిస్టేబుల్ దారుణంగా హత్య చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ఇద్దరి మధ్య ఏర్పడిన ప్రేమ వివాహ బంధంగా మారింది. కొంతకాలం వీరి సంసారం సజావుగానే సాగినప్పటికీ, ఆ తర్వాత కుటుంబంలో విభేదాలు మొదలైనట్లు తెలుస్తోంది. చివరకు భార్యను హత్య చేసి మృతదేహాన్ని గోదావరి నదిలో పడేసినట్లు ఆరోపణలు రావడం స్థానికంగా కలకలం రేపుతోంది.
సోషల్ మీడియా పరిచయం.. ప్రేమ వివాహం
వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లికి చెందిన నరేందర్ ఏఆర్ విభాగంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. సుమారు రెండేళ్ల క్రితం సోషల్ మీడియా ద్వారా భవానీతో అతడికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ దంపతులు కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్‌లో నివాసం ఉంటున్నారు.
వీరికి ఎనిమిది నెలల క్రితం ఓ మగబిడ్డ జన్మించగా, ఆ చిన్నారి మరణించినట్లు సమాచారం. అప్పటి నుంచి కుటుంబంలో పరిస్థితులు మారినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా నరేందర్ తన భార్య భవానీని వేధిస్తున్నట్లు సమాచారం.
భార్యను హత్య చేసి గోదావరిలో పడేశాడా?
ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం నరేందర్ తన భార్య భవానీని అత్యంత దారుణంగా హత్య చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనంతరం ఆమె మృతదేహాన్ని ఓ సంచిలో మూటకట్టి తీసుకెళ్లి గోదావరి నదిలో పడేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
మరోవైపు, ఈ విషయం వెలుగులోకి రాకముందే ఏఆర్ కానిస్టేబుల్ నరేందర్ కొత్తగూడెం త్రీ టౌన్ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ ఘటన వెనుక అసలు కారణాలేంటి? భవానీని హత్య చేయడానికి దారితీసిన పరిస్థితులేంటి? గోదావరి నదిలో పడేసినట్లు చెబుతున్న ఆమె మృతదేహం లభ్యమైందా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.
ఈ ఘటనకు సంబంధించి కొత్తగూడెం త్రీ టౌన్ పోలీసులు అధికారికంగా వివరాలు వెల్లడించాల్సి ఉంది. పోలీసుల దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
