
హైదరాబాద్‌లో నేరాల నియంత్రణ, ప్రజల భద్రతే లక్ష్యంగా మల్కాజిగిరి పోలీసులు అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నంచారమ్మ కాలనీ, ఏకలవ్య కాలనీల్లో చేపట్టిన ఈ తనిఖీల్లో 43 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద వ్యక్తులతో పాటు రౌడీషీటర్‌ను కూడా గుర్తించారు.
హైదరాబాద్: మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల వరకు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నంచారమ్మ కాలనీ, ఏకలవ్య కాలనీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్‌లో భాగంగా పోలీస్ కమిషనర్ బి. సుమతి ఆదేశాలతో ఈ ఆపరేషన్ చేపట్టారు.
ఎల్బీనగర్ జోన్ డీసీపీ బి. అనురాధ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో మొత్తం 204 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. వీరిలో సుమారు 105 మంది క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టారు. కాలనీల్లోకి కొత్తగా వస్తున్న వ్యక్తుల కదలికలను పరిశీలించడంతో పాటు అనుమానాస్పదంగా కనిపించిన వారిని తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులతో పాటు ఒక రౌడీషీటర్‌ను పోలీసులు గుర్తించారు. సరైన పత్రాలు లేని 43 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 10 లీటర్ల మద్యాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అసాంఘిక కార్యకలాపాలపై నిఘా
కాలనీల్లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నిరంతరం నిఘా కొనసాగిస్తామని పోలీసులు వెల్లడించారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. తమ పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని స్థానిక నివాసితులకు సూచించారు.
