
అల్లరి సుభాషిణి.. ఈ పేరు వినగానే తెలుగు ప్రేక్షకులకు ఆమె కామెడీ పాత్రలు గుర్తుకొస్తాయి. ‘అల్లరి’ సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ఆ తర్వాత అల్లరి సుభాషిణిగా మారిపోయారు. తనదైన కామెడీ టైమింగ్, ప్రత్యేకమైన నటనతో లేడీ కమెడియన్‌గా ప్రేక్షకులను అలరించారు. అయితే కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ప్రముఖ నటి అల్లరి సుభాషిణి తాజాగా తన వ్యక్తిగత జీవితం, సినీ ప్రస్థానం, హైదరాబాద్‌తో ఉన్న అనుబంధం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఒకప్పుడు హైదరాబాద్‌లో నివసించిన రోజులను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. కృష్ణానగర్, ఇందిరానగర్, యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్ ప్రాంతాలను చూసినప్పుడల్లా పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయని చెప్పారు. హైదరాబాద్ తనకు సొంత ఇల్లు లాంటిదని, ముఖ్యంగా తెలంగాణ ప్రజలు తనపై ఎంతో ప్రేమాభిమానాలు చూపించారని తెలిపారు.
తన కెరీర్ ప్రారంభం నుంచి ఎదుగుదల వరకు పలువురు అండగా నిలిచారని సుభాషిణి గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా శ్రీశైలం యాదవ్ తనకు ఎంతో సహాయం చేశారని, ఆయన కుటుంబంతో మంచి అనుబంధం ఉండేదని వెల్లడించారు. ఆయన కుమారుడు, ప్రస్తుత ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌తో కూడా తనకు మంచి పరిచయం ఉండేదని చెప్పారు. తరచూ వారి ఇంటికి వెళ్లి మాట్లాడటం, భోజనం చేయడం వంటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అయితే అనారోగ్య సమస్యలు ఎదురైన తర్వాత హైదరాబాద్‌ను విడిచి భీమవరం వెళ్లాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
నాటకాల నుంచి సినిమాల్లోకి ఎంట్రీ..
సుభాషిణి తన నటనా ప్రయాణాన్ని నాటకరంగం నుంచి ప్రారంభించారు. మద్రాసులో చింతామణి నాటకాలు ప్రదర్శిస్తున్న సమయంలో ప్రముఖ నటుడు చలపతిరావు ఆమె నటనను గుర్తించారు. అప్పట్లో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు నాటకాలను వీక్షించేందుకు వచ్చేవారని ఆమె తెలిపారు. రాళ్లపల్లి వంటి నటులు కూడా నాటకాలు చూసేవారని గుర్తు చేసుకున్నారు.
ఒకసారి చలపతిరావు తనను ఇంటికి ఆహ్వానించారని, అక్కడ భోజనం చేసి వచ్చానని చెప్పారు. ఆ తర్వాత పరుచూరి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఆగస్టు 15 నాటక కార్యక్రమంలో మరోసారి చింతామణి నాటకంలో పాల్గొన్నారు. అక్కడ మళ్లీ చలపతిరావును కలిశారు. తన కుమారుడు రవిబాబు సినిమా చేస్తున్నాడని, వెళ్లి కలవాలని ఆయన సూచించారట. సినిమాలో పాత్రకు ఎంపికైతే నటించాలని, లేకపోతే బాధపడాల్సిన అవసరం లేదని చెప్పినట్లు సుభాషిణి వెల్లడించారు.
నైటీతోనే మొదటి షూటింగ్‌కు హాజరు..
తన మొదటి సినిమా షూటింగ్ అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ సుభాషిణి ఆసక్తికర విషయాలు చెప్పారు. సినిమా యూనిట్ సభ్యులు తన భీమవరం చిరునామాను కనుగొనలేకపోయారట. దీంతో చలపతిరావు పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి తన ఆచూకీ తెలుసుకోవాలని కోరారని తెలిపారు. స్థానిక సీఐ ఓ కానిస్టేబుల్‌ను తన ఇంటికి పంపించి సినిమా అవకాశం వచ్చిందని సమాచారం అందించడంతో వెంటనే హైదరాబాద్‌కు బయలుదేరినట్లు చెప్పారు.
అయితే షూటింగ్‌కు వెళ్లినప్పుడు తన దగ్గర సరైన దుస్తులు కూడా లేవని, నైటీతోనే షూటింగ్‌కు హాజరయ్యానని గుర్తు చేసుకున్నారు. అలా నైటీలో నటించడం మొదట్లో ఇబ్బందిగా, సిగ్గుగా అనిపించిందని తెలిపారు. కానీ సినిమాలో తన పాత్ర అలానే ఉంటుందని దర్శకుడు రవిబాబు చెప్పడంతో నటించాల్సి వచ్చిందన్నారు.
రవిబాబు అంటేనే భయపడ్డా..
తన జీవితంలో ఎప్పుడూ ఎవరినీ చూసి భయపడలేదని, కానీ దర్శకుడు రవిబాబును మాత్రం చూసి భయపడేదానినని సుభాషిణి సరదాగా చెప్పారు. ఆయన చాలా సీరియస్‌గా ఉండేవారని, మొదటి షూటింగ్ సమయంలో ఆయనతో పనిచేయడం తనకు కొత్త అనుభవమని వెల్లడించారు.
సినిమా రంగంలోకి ఆలస్యంగా అడుగుపెట్టినా సుమారు దశాబ్దం పాటు తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నానని ఆమె పేర్కొన్నారు. కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ, విభిన్నమైన హావభావాలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా తన సినీ జీవితంలో ఎదురైన అనుభవాలు, అవకాశాలు, తనకు అండగా నిలిచిన వ్యక్తుల గురించి అల్లరి సుభాషిణి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి.
