Shocking Details Emerge in Hyderabad Illegal Egg Collection Case; Women Suspected of Receiving Hormonal Injections

హైదరాబాద్‌లో వెలుగుచూసిన అక్రమ అండాల సేకరణ వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. మహిళలను ఈ అక్రమ వ్యవహారంలోకి ఎలా తీసుకొచ్చారు? వారి నుంచి అండాలను ఏ విధంగా సేకరించారు? సేకరించిన అండాలను ఎక్కడికి తరలిస్తున్నారు? ఈ నెట్‌వర్క్ వెనుక ఎవరున్నారు? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు.

తొలుత వ్యభిచార రాకెట్‌కు సంబంధించిన వ్యవహారంగా భావించిన పోలీసులు.. దర్యాప్తులో అక్రమ అండాల సేకరణ కోణాన్ని గుర్తించారు. ఈ క్రమంలో మహిళలకు హార్మోనల్ ఇంజెక్షన్లు ఇచ్చి అండాలను సేకరించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో స్వాధీనం చేసుకున్న ఇంజెక్షన్లను పోలీసులు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించారు. వాటి వివరాలు, వినియోగం, మహిళలకు వాటిని ఏ విధంగా అందించారనే అంశాలపై నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు.

మరోవైపు అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (ART) కేంద్రాలు, ఫెర్టిలిటీ ఆసుపత్రుల మధ్య ఉన్న సంబంధాలపైనా పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఏఆర్టీ కేంద్రాల ద్వారా మహిళలను ఎలా గుర్తించారు? ఈ వ్యవహారంలో మధ్యవర్తులు ఎవరున్నారు? ఆసుపత్రులు, ఫెర్టిలిటీ సెంటర్ల పాత్ర ఎంతవరకు ఉంది? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది.

మూడు ఆసుపత్రులు, మూడు ఫెర్టిలిటీ సెంటర్లలో పోలీసుల తనిఖీలు

ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే మూడు ఆసుపత్రులు, మూడు ఫెర్టిలిటీ సెంటర్లలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అంతేకాకుండా మరో 22 ఫెర్టిలిటీ సెంటర్లకు ఏఆర్టీ కేంద్రాలతో ఉన్న సంబంధాలను కూడా పరిశీలిస్తున్నారు. ఈ నెట్‌వర్క్‌లో మరెవరైనా భాగస్వాములుగా ఉన్నారా? అండాల సేకరణ ప్రక్రియ నిబంధనలకు అనుగుణంగా జరిగిందా? అనే అంశాలపై ఆధారాలు సేకరిస్తున్నారు.

రాష్ట్రంలో ఇలాంటి అక్రమ వ్యవహారానికి సంబంధించిన సమాచారం తొలిసారిగా అందడంతో పోలీసులు అప్రమత్తమై దర్యాప్తు ప్రారంభించినట్లు సీపీ సుమతి వెల్లడించారు. సంతానం కోసం ఫెర్టిలిటీ కేంద్రాలను ఆశ్రయించే వారు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతున్నప్పటికీ.. అండాల సేకరణ ప్రక్రియ ఎలా జరుగుతోంది? అది చట్టబద్ధమైన పద్ధతిలోనే నిర్వహిస్తున్నారా? అనే విషయాలను కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.

పెళ్లి కాకపోయినా వివాహమైనట్లు నకిలీ పత్రాలు?

ఈ కేసులో మరో కీలక అంశం అండాల దాతలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు. ఎగ్ డొనేషన్‌కు సంబంధించి అవసరమైన అర్హత పత్రాల్లో తప్పుడు వివరాలు నమోదు చేశారా? పెళ్లి కాని మహిళలను వివాహమైన వారిగా చూపించారా? భర్త లేని మహిళలకు భర్త ఉన్నట్లు నకిలీ ధ్రువీకరణ పత్రాలు సమర్పించారా? అనే అనుమానాలపై పోలీసులు విచారణ చేపట్టారు.

అండాల సేకరణకు సంబంధించి నిబంధనల ప్రకారం అవసరమైన అర్హతలను పరిశీలించకుండా పత్రాలను సృష్టించారా? ఈ వ్యవహారంలో ఎవరెవరు సహకరించారు? అనే అంశాలను కూడా దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు. విచారణలో నకిలీ పత్రాలు లేదా ఇతర అక్రమాలు బయటపడితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ సుమతి స్పష్టం చేశారు.

మొత్తంగా హైదరాబాద్‌లో వెలుగుచూసిన ఈ అక్రమ అండాల సేకరణ కేసు వెనుక ఉన్న అసలు నెట్‌వర్క్‌ను గుర్తించడమే లక్ష్యంగా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఫోరెన్సిక్ నివేదికలు, ఆసుపత్రుల తనిఖీలు, ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తయిన తర్వాత ఈ వ్యవహారంలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *