Singareni Workers Get Diwali Bonanza! Centre Announces Rs.1,10,250 Bonus for Each Employee

సింగరేణి కార్మికులకు దీపావళి పండుగ వేళ భారీ శుభవార్త అందింది. కేంద్ర ప్రభుత్వం నుంచి కార్మికులకు పండుగ కానుకగా ఒక్కొక్కరికి రూ.1,10,250 చొప్పున పర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డ్ (PLR) బోనస్ అందనుంది. సంస్థ సాధించిన పనితీరు, ఆర్థిక ఫలితాలను పరిగణనలోకి తీసుకుని ఈ బోనస్ మొత్తాన్ని ఖరారు చేశారు. దీంతో సింగరేణి బొగ్గు గనుల ప్రాంతాల్లో పండుగ సందడి మరింత పెరిగింది.

2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కోల్ ఇండియా సంయుక్త సంప్రదింపుల కమిటీ సమావేశంలో సింగరేణి కార్మికులకు చెల్లించాల్సిన పీఎల్‌ఆర్ బోనస్‌పై నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా అర్హులైన ప్రతి కార్మికుడికి గురువారం రూ.1,10,250 బోనస్ చెల్లించనున్నారు. ఇప్పటికే దసరా పండుగ సందర్భంగా సంస్థ లాభాల్లో వాటాగా ఒక్కొక్కరికి సగటున రూ.1,53,912 చెల్లించారు. తాజాగా ప్రకటించిన బోనస్‌తో కార్మికులు, వారి కుటుంబాల్లో ఆనందం నెలకొంది.

దేశ ఇంధన భద్రతలో సింగరేణి కార్మికుల పాత్ర కీలకం: కిషన్ రెడ్డి

దీపావళి సందర్భంగా సింగరేణి కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. దేశ ఇంధన భద్రతకు సింగరేణి కార్మికులు వెన్నెముకగా నిలుస్తున్నారని ఆయన ప్రశంసించారు. ఎండా, వానా అనే తేడా లేకుండా నిరంతరం శ్రమిస్తూ దేశానికి అవసరమైన బొగ్గు ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికుల సేవలు ఎంతో విలువైనవని పేర్కొన్నారు.

బొగ్గు రంగ అభివృద్ధితో పాటు కార్మికుల భద్రత, సంక్షేమం, ఆర్థిక స్థిరత్వానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని కిషన్ రెడ్డి వెల్లడించారు. సింగరేణి సంస్థ మరింత అభివృద్ధి చెందేందుకు కేంద్రం నుంచి అవసరమైన సహకారం ఎల్లప్పుడూ అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. భారీ బోనస్‌తో ఈ ఏడాది దీపావళి పండుగను సింగరేణి కార్మికులు మరింత ఆనందంగా జరుపుకోనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *