
సిద్దిపేట జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కలకలం.. పామును చూసి భయంతో పరుగులు తీసిన రోగులు, సిబ్బంది
సిద్దిపేట జిల్లా: ప్రభుత్వ ఆసుపత్రిలో విషపూరితమైన పాము ప్రవేశించడంతో రోగులు, వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పాము ఆసుపత్రి ప్రాంగణంలో సంచరిస్తుండటంతో అక్కడ కొద్దిసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చోటుచేసుకుంది.
చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన రోగులు, విధుల్లో ఉన్న వైద్య సిబ్బంది పామును చూసి భయంతో పరుగులు తీశారు. ఆసుపత్రి ఆవరణలో విషపూరితమైన పాము కనిపించడంతో ఏం చేయాలో తెలియక ఆందోళనకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ వెంటనే ఆసుపత్రికి చేరుకుని పామును అక్కడి నుంచి తొలగించే చర్యలు చేపట్టారు. దీంతో రోగులు, వైద్య సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఘటనపై గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చుట్టూ ప్రహరీ గోడ లేకపోవడమే ఇలాంటి ఘటనలకు కారణమని తెలిపారు. ఆసుపత్రిలోకి విషపూరితమైన పాములు ప్రవేశించడం ఇది మొదటిసారి కాదని, ఇప్పటికే ఇలాంటి ఘటనలు మూడుసార్లు చోటుచేసుకున్నాయని వెల్లడించారు.
ప్రజలకు వైద్య సేవలు అందించాల్సిన ప్రభుత్వ ఆసుపత్రిలోనే రోగులు, వైద్య సిబ్బందికి భద్రత లేకపోవడం విచారకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రి చుట్టూ వెంటనే ప్రహరీ గోడ నిర్మించాలని, రాత్రి వేళల్లో పాములు, ఇతర ప్రమాదాల నుంచి రక్షణ కల్పించేందుకు నైట్ వాచ్‌మెన్‌ను నియమించాలని సంబంధిత అధికారులను కోరారు.
మరోవైపు, ఆసుపత్రిలో తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్యం కోసం వచ్చే ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా అధికారులు తక్షణమే స్పందించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస భద్రతా సదుపాయాలు కల్పించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
