
D News: Nov 4: తెలంగాణ రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ సర్వీసులను క్రమబద్ధీకరించడంతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరవధిక సమ్మెకు దిగారు. గత నెల 13వ తేదీన ప్రారంభమైన ఈ సమ్మె నేటితో 22వ రోజుకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన కొనసాగిస్తున్నారు.
తెలంగాణలో జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలో మొత్తం 17,541 మంది ఉద్యోగులు వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 78 రకాల క్యాడర్లలో వీరు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో దాదాపు 70 శాతం మంది ఔట్సోర్సింగ్ సిబ్బందే ఉన్నారు. ఏళ్ల తరబడి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నామని, కుటుంబ పోషణకు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ప్రాథమిక వైద్య వ్యవస్థను బలోపేతం చేయడం, పట్టణాల్లోని పేదలు, మురికివాడల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం జాతీయ ఆరోగ్య మిషన్ ప్రధాన లక్ష్యాలు. దేశవ్యాప్తంగా 1.86 లక్షలకు పైగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలుగా ఆధునీకరించి ఉచిత వైద్య సలహాలు, వ్యాధుల స్క్రీనింగ్, మందుల పంపిణీ వంటి సేవలు అందిస్తున్నారు.
అలాగే ఆశా కార్యకర్తలు ప్రజలకు, ఆరోగ్య వ్యవస్థకు మధ్య వారధిగా పనిచేస్తున్నారు. గర్భిణులు ఆసుపత్రుల్లో ప్రసవించేలా ప్రోత్సహించడం, తల్లులు, పిల్లలకు ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ కల్పించే టీకా కార్యక్రమాలు నిర్వహించడం వంటి కీలక బాధ్యతలను ఆరోగ్య సిబ్బంది నిర్వర్తిస్తున్నారు. అయితే ఇంతటి ముఖ్యమైన సేవలు అందిస్తున్న వారిలో చాలామంది ఇప్పటికీ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ లేదా గౌరవ వేతన పద్ధతుల్లోనే పనిచేస్తుండటం ప్రధాన సమస్యగా మారింది.
ప్రతి పౌరుడికి నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యం
దేశవ్యాప్తంగా సుమారు 12 లక్షల మందికి పైగా ఆరోగ్య సిబ్బంది ఒప్పంద ప్రాతిపదికన ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ఆరోగ్య వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న తమ సమస్యలు చాలా కాలంగా పరిష్కారానికి నోచుకోవడం లేదని ఉద్యోగులు చెబుతున్నారు. దీంతో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది జేఏసీగా ఏర్పడి ఆందోళన బాట పట్టారు.
గత నెల 13వ తేదీ నుంచి ఎన్హెచ్ఎం ఉద్యోగులు విధులను బహిష్కరించి సమ్మెకు దిగడంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడుతోంది. రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టరేట్లు, డీఎంహెచ్ఓ కార్యాలయాల ఎదుట గత మూడు వారాలుగా నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నారు. ఈ సమ్మె ప్రభావంతో పలు ఆన్లైన్ వైద్య సేవలు కూడా నిలిచిపోయాయి.
ఎన్హెచ్ఎం పరిధిలోని 78 క్యాడర్ల ఉద్యోగులను ఎలాంటి షరతులు లేకుండా రెగ్యులరైజ్ చేయాలని, అప్పటివరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని ఉద్యోగులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. క్యాడర్ వారీగా వేతనాలు అమలు చేయడంతో పాటు పీఆర్సీ, 5 శాతం డీఏ, ఏటా 5 శాతం ఇంక్రిమెంట్, 8 శాతం లాయల్టీ బోనస్ కల్పించాలని కోరుతున్నారు.
అంతేకాకుండా 2022 నుంచి పెంచాల్సిన 5 శాతం వేతనాన్ని వెంటనే చెల్లించాలని, ప్రతినెలా 5వ తేదీలోపు జీతాలు అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఔట్సోర్సింగ్ ఏజెన్సీల విధానాన్ని రద్దు చేసి, స్పర్శ 2.0 ద్వారా నేరుగా వేతనాలు చెల్లించాలని కోరుతున్నారు. ఉద్యోగులను స్టేట్ హెల్త్ సొసైటీ పరిధిలోనే కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
మహిళా ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, హెల్త్ కార్డులు, బీమా సౌకర్యం కల్పించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. విధి నిర్వహణలో ఉద్యోగి మరణిస్తే రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు వారి కుటుంబంలో అర్హులైన ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరుతున్నారు. అదేవిధంగా జీవో 1195ను పునఃపరిశీలించి తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు నిరంతరం పనిచేస్తున్న వైద్య సిబ్బందికి తగిన వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. ఆరోగ్య సేవలు అందించే సిబ్బందికి భరోసా కల్పించినప్పుడే ప్రజారోగ్య వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని, ప్రతి పౌరుడికి నాణ్యమైన వైద్యం అందించే లక్ష్యం నెరవేరుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.
