Indiramma Towers Lottery Today for 1,741 Flats: 17,867 Eligible Applicants to Participate Across 14 Constituencies

14 నియోజకవర్గాల్లో 17,867 మంది అర్హుల మధ్య ఇ-లాటరీ

ఖైరతాబాద్‌లో అత్యధికంగా 327 ఫ్లాట్లు.. ఉదయం 10.30 నుంచి డ్రా

హైదరాబాద్‌: ఇందిరమ్మ టవర్స్‌ పథకంలో భాగంగా 14 నియోజకవర్గాల్లో మిగిలిన ఫ్లాట్ల కేటాయింపునకు అధికారులు మరోసారి లాటరీ నిర్వహించనున్నారు. మొత్తం 1,741 ఫ్లాట్ల కోసం బుధవారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు ఇ-లాటరీ తీయనున్నారు. ఈ ప్రక్రియలో పాల్గొనేందుకు అర్హత సాధించిన 17,867 మంది దరఖాస్తుదారుల మధ్య డ్రా నిర్వహించనున్నారు. వీరిలో ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో నిర్మించనున్న ఫ్లాట్ల సంఖ్య అత్యధికంగా 327గా ఉంది.

లాటరీ ప్రక్రియను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అర్హులైన దరఖాస్తుదారులకు అవకాశం కల్పించారు. ఇందుకోసం తెలంగాణ హౌసింగ్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారిక యూట్యూబ్‌ ఛానల్‌లో లైవ్‌ ప్రసారం చేయనున్నారు.

తొలివిడతలో 16 నియోజకవర్గాలకు లాటరీ ప్రకటించగా.. శేరిలింగంపల్లి, ఇబ్రహీంపట్నం మినహా మిగిలిన 14 నియోజకవర్గాల్లో మరోసారి డ్రా నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొదటిసారి లాటరీలో పేర్లు వచ్చిన కొందరు దరఖాస్తుదారులు తమ నియోజకవర్గాల వివరాలను తప్పుగా నమోదు చేశారు. మరికొందరు రూ.6 లక్షలు చెల్లించాల్సి రావడంతో వెనక్కి తగ్గారు. క్షేత్రస్థాయి పరిశీలనలో ఇంకొందరు అనర్హులుగా తేలారు. దీంతో మిగిలిన ఫ్లాట్లకు మళ్లీ లాటరీ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.

అర్హులందరికీ ఇల్లు దక్కుతుందా?

14 నియోజకవర్గాల్లో మిగిలిన 1,741 ఫ్లాట్ల కోసం తొలి విడత లాటరీలో అవకాశం దక్కని 17,867 మంది అర్హుల మధ్య మరోసారి డ్రా తీయనున్నారు. ఫ్లాట్ల సంఖ్యకు అదనంగా 50 శాతం మందిని ఎంపిక చేసి నిరీక్షణ జాబితాలో చేర్చనున్నారు.

ఈ జాబితాలో చోటు దక్కిన వారికి తదుపరి దశల్లో ఫ్లాట్లు కేటాయించే అవకాశం ఉంటుంది. మొత్తంగా అర్హులుగా గుర్తించిన దరఖాస్తుదారులకు ఏదో ఒక దశలో ఇల్లు లభిస్తుందని హౌసింగ్‌బోర్డు వర్గాలు చెబుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *