
Adilabad RIMS Hospital: తెలంగాణలోని ఆదిలాబాద్ రిమ్స్ ప్రభుత్వ ఆస్పత్రి మరోసారి వార్తల్లో నిలిచింది. ఆస్పత్రిలో భద్రతా లోపాలు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా దొంగలు రెచ్చిపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా గుర్తుతెలియని వ్యక్తులు పట్టపగలే ఆస్పత్రిలోకి ప్రవేశించి, రోగులకు అత్యవసరంగా ఉపయోగించే వెంటిలేటర్లను చోరీ చేశారు. సుమారు రూ.30 లక్షల విలువైన పరికరాలు మాయమవడం కలకలం రేపుతోంది.
ఆదిలాబాద్ రిమ్స్‌లో వరుస వివాదాలు చోటుచేసుకుంటుండటం ఆందోళన కలిగిస్తోంది. గత సెప్టెంబర్‌లో ఏసీ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఐదుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర దుమారం రేపింది. అనంతరం అక్టోబర్‌లో ఓ రోగికి వైద్యం అందించకుండా ఇబ్బందులకు గురిచేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అంతకుముందు మే నెలలో ఓ వైద్య విద్యార్థినికి లైంగిక వేధింపులు, అక్రమ టెండర్ల వ్యవహారాలు కూడా ఆస్పత్రి ప్రతిష్ఠను దెబ్బతీశాయి. తాజాగా భద్రతా వైఫల్యం కారణంగా భారీ చోరీ జరగడం మరోసారి ఆస్పత్రి నిర్వహణపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. అక్టోబర్ 30న మధ్యాహ్నం సమయంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రిమ్స్ ఆస్పత్రిలోని RICU విభాగంలోకి ప్రవేశించారు. అక్కడ రోగుల పడకల పక్కనే ఏర్పాటు చేసిన వెంటిలేటర్లను తొలగించి తీసుకెళ్లారు. ఈ మొత్తం వ్యవహారం ఆస్పత్రిలోని సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయింది. కెమెరాలు తమను చిత్రీకరిస్తున్నాయనే విషయం తెలిసినా నిందితులు ఏమాత్రం భయపడకుండా చోరీకి పాల్పడటం గమనార్హం.
అయితే చోరీ జరిగిన వెంటనే విషయం బయటకు రాకుండా ఆస్పత్రి యాజమాన్యం దాదాపు వారం రోజుల పాటు గోప్యంగా ఉంచినట్లు సమాచారం. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తూ నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. త్వరలోనే వారిని గుర్తించి అరెస్ట్ చేస్తామని పోలీసులు వెల్లడించారు.
రోగులకు ప్రాణాధారంగా నిలవాల్సిన వెంటిలేటర్లే చోరీకి గురవడం, అదీ ప్రభుత్వ ఆస్పత్రిలో సీసీ కెమెరాల నిఘా మధ్య జరగడం రిమ్స్ భద్రతా వ్యవస్థ పనితీరుపై తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
