
ఒకప్పుడు తన పొలంలో పంటలు పండిస్తూ నలుగురికి అన్నం పెట్టిన రైతు.. నేడు కుటుంబాన్ని పోషించుకోవడం కోసం రోజువారీ కూలీగా మారాడు. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంట కళ్ల ముందే ఎండిపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. వ్యవసాయమే జీవనాధారంగా బతికిన అన్నదాతకు ఇప్పుడు కూలి పనులే దిక్కయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం కొండ్రెడ్డిచెరువులో వెలుగుచూసిన ఈ రైతు దీనస్థితి పలువురిని కలచివేస్తోంది.
ఐదెకరాల భూమి ఉన్నా.. సాగుకు నీరు కరువు!
కొండ్రెడ్డిచెరువు గ్రామానికి చెందిన నీల లక్ష్మీనారాయణకు ఐదెకరాల వ్యవసాయ భూమి ఉంది. తనకున్న భూమిలో బోరు నీటిని ఆధారంగా చేసుకుని మూడు ఎకరాల్లో వరి సాగు చేశాడు. పంట చేతికొస్తుందని ఆశగా ఎదురుచూశాడు. అయితే వరి పంట పొట్ట దశకు చేరుకునే సమయంలో విద్యుత్ కోతలు, వర్షాభావ పరిస్థితులు ఆయన ఆశలపై నీళ్లు చల్లాయి.
పంటకు సరిపడా నీరు అందకపోవడంతో సాగు చేసిన వరి మొత్తం ఎండిపోయింది. పంట కోసం పెట్టిన పెట్టుబడి అంతా వృథా కావడంతో లక్ష్మీనారాయణ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. అప్పులు, కుటుంబ ఖర్చులు ఎలా భరించాలో తెలియక ఆందోళన చెందాడు.
పశువులను అమ్ముకున్న రైతు.. చివరకు కూలీగా మారి!
పంట నష్టంతో పాటు పశువుల పోషణ కూడా లక్ష్మీనారాయణకు భారంగా మారింది. తనకు తోడుగా ఉన్న నాలుగు పశువులకు సరైన నీరు, పశుగ్రాసం అందించలేని పరిస్థితి ఏర్పడటంతో వాటిని సైతం అమ్ముకోవాల్సి వచ్చింది. ఒకవైపు వ్యవసాయంలో నష్టం.. మరోవైపు కుటుంబ పోషణ భారంగా మారడంతో చేసేదేమీ లేక రోజువారీ కూలీ పనులకు వెళ్లడం ప్రారంభించాడు.
ఒకప్పుడు తన సొంత పొలంలో వ్యవసాయం చేస్తూ పంటలు పండించిన చేతులే.. ఇప్పుడు ఇతరుల పొలాల్లో కూలీ పనులు చేస్తున్నాయి. పది మందికి అన్నం పెట్టే రైతన్నే తన కుటుంబం కోసం కూలీగా మారిన దుస్థితి గ్రామస్థులను కలచివేస్తోంది.
అన్నదాతకు అండగా నిలిచేది ఎవరు?
వ్యవసాయాన్ని నమ్ముకుని జీవిస్తున్న రైతులకు సాగునీరు అందకపోతే వారి పరిస్థితి ఎంత దయనీయంగా మారుతుందో లక్ష్మీనారాయణ ఉదంతం స్పష్టం చేస్తోంది. పంటల సాగు కోసం పెట్టిన పెట్టుబడులు కళ్లముందే నష్టంగా మారడంతో రైతు కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నాయి. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, పంట నష్టపోయిన అన్నదాతలకు అండగా నిలవాలని పలువురు కోరుతున్నారు.
