
తెలుగు రాష్ట్రాలపై తుపాను ప్రభావం కొనసాగుతోంది. మురసు తుపాను మంగళవారం తెల్లవారుజామున నెల్లూరు-నర్సాపురం మధ్య ఒంగోలు సమీపంలో తీరం దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం వాయవ్య దిశగా కదులుతున్న ఈ తుపాను క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని తెలిపారు. అయితే తుపాను ప్రభావంతో తెలంగాణలో మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ చేశారు. ఇదిలా ఉండగా, ఈ నెల 15 నాటికి బంగాళాఖాతంలో మరో తుపాను ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
తెలంగాణలో మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్
మురసు తుపాను తెలంగాణకు సమీపంగా కదులుతున్న నేపథ్యంలో వాతావరణ శాఖ అప్రమత్తమైంది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. మహబూబాబాద్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా, ములుగు, వరంగల్, హనుమకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
రాష్ట్రంలో బుధవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. గురువారం నుంచి తుపాను ప్రభావం తగ్గుముఖం పట్టే సూచనలు ఉన్నాయని, దీంతో వర్షాల తీవ్రత క్రమంగా తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు.
పలు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదు
గత 24 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గణనీయమైన వర్షపాతం నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో 6.10 సెంటీమీటర్లు, నాయుడుపేటలో 5.60 సెంటీమీటర్లు, మల్కారంలో 5.40 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
ఖమ్మం జిల్లా వేంసూర్‌లో 5.23 సెంటీమీటర్లు, సదాశివపాలెంలో 4.78 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్, సూర్యాపేట, ములుగు, మహబూబాబాద్, నల్లగొండ జిల్లాల్లోనూ పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసినట్లు అధికారులు వెల్లడించారు.
నవంబర్ 15 నాటికి మరో తుపాను?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడి తుపానుగా మారే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 15 నాటికి కొత్త తుపాను ఏర్పడే అవకాశం ఉందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దీనిపై నవంబర్ 9 లేదా 10వ తేదీన మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ తుపాను ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, చిత్తూరు జిల్లాల మధ్య తీరం దాటే అవకాశముందని భావిస్తున్నారు. దీని ప్రభావం దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలతోపాటు తమిళనాడుపైనా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
మురసు తుపానుతో రైతులకు భారీ నష్టం
మరోవైపు మురసు తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతింటున్నాయని అన్నదాతలు వాపోతున్నారు. ముఖ్యంగా పత్తి, వరి పంటలపై వర్షాల ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది.
ప్రస్తుతం పత్తి ఏరేందుకు సిద్ధమవుతున్న సమయంలో వర్షాలు కురుస్తుండటంతో పత్తి తడిసి నాణ్యత కోల్పోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనివల్ల దిగుబడితోపాటు మార్కెట్‌లో గిట్టుబాటు ధర కూడా తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు ఈదురుగాలులకు వరి పంట నేలవాలడంతో ధాన్యం రాలిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో దెబ్బతిన్న పంటలు
ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం చొప్పకట్లపాలెంలో వర్షానికి పత్తి తడిసి చెట్ల నుంచి రాలిపోతోంది. కల్లూరు, తల్లాడ మండలం రామచంద్రాపురం ప్రాంతాల్లో వరి పంట నేలవాలింది. వైరా మండలం స్నానాల లక్ష్మీపురంలో రైతులు ధాన్యం రాశులు తడవకుండా టార్పాలిన్లు కప్పి రక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
సూర్యాపేట జిల్లాలోని పెన్‌పహాడ్, చిలుకూరు, సూర్యాపేట రూరల్, మేళ్లచెర్వు, మఠంపల్లి, కోదాడ ప్రాంతాల్లో వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. నల్లగొండ జిల్లా శాలిగౌరారంలోనూ వరి పంట నేలకొరిగి, పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది.
పంటల సాగు కోసం వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులు.. చేతికొచ్చే సమయంలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పంట నష్టాన్ని అంచనా వేసి తమను ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.
