
హైదరాబాద్‌లోని మల్కాజిగిరి మండలం లోతుకుంట గ్రామ భూముల వివాదంలో తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సర్వే నంబర్లు 1, 2లో ఉన్న 40 ఎకరాల భూములకు సంబంధించి హక్కులు నిర్ధారణ అయిన నేపథ్యంలో.. ఆ భూములపై గతంలో విధించిన స్టేటస్కో ఉత్తర్వులను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. అదే సమయంలో కోర్టు ధిక్కరణ కేసులో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను పదవి నుంచి తొలగించాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులపై గతంలో విధించిన స్టేను కొనసాగించింది. దీంతో రంగనాథ్‌కు ఊరట లభించింది.
భూముల వివాదంపై హైకోర్టులో వాదనలు
లోతుకుంట గ్రామంలోని సర్వే నంబర్లు 1, 2లో ఉన్న 40 ఎకరాల భూములకు సంబంధించి దాఖలైన అప్పీళ్లపై జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ యారా రేణుకతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా ఏవీ రంగనాథ్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. వివాదాస్పద ఆస్తి గుర్తింపుపై అభ్యంతరాలు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. మరోవైపు శాంతా శ్రీరాం కన్స్ట్రక్షన్స్ కంపెనీ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. సదరు భూములకు సంబంధించి సివిల్ కోర్టుతోపాటు సుప్రీంకోర్టు కూడా తమకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చాయని వివరించారు. ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ)ను సైతం సుప్రీంకోర్టు కొట్టివేసిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
రంగనాథ్‌ను తొలగించాలన్న ఉత్తర్వులపై స్టే కొనసాగింపు
వాదనలు విన్న ధర్మాసనం.. భూముల వివాదానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి తాము వెళ్లడం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం తమ ముందున్న అప్పీళ్ల పరిధి కోర్టు ధిక్కరణ కేసులో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను పదవి నుంచి తొలగించాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులకే పరిమితమని పేర్కొంది.
రంగనాథ్‌ను ఉద్యోగం నుంచి రిలీవ్ చేసి, ఆయన స్థానంలో అర్హులైన మరో వ్యక్తిని నియమించాలన్న సింగిల్ జడ్జి ఆదేశాలపై గతంలో విధించిన స్టేను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే భూముల గుర్తింపునకు సంబంధించి చేపట్టే సర్వేపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోమని స్పష్టం చేసింది.
గతంలో జారీ చేసిన స్టేటస్కో ఉత్తర్వులను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించిన ధర్మాసనం.. తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 20కి వాయిదా వేసింది.
ఉత్తర్వుల జారీకి ఏఐ వినియోగమా? కలెక్టర్‌కు హైకోర్టు ప్రశ్న
మరోవైపు రెవెన్యూ వివాదాల పరిష్కారంలో కృత్రిమ మేధ (ఏఐ)ను ఉపయోగించి ఉత్తర్వులు జారీ చేస్తున్నారన్న ఆరోపణలపై హైకోర్టు స్పందించింది. జనగామ జిల్లా కలెక్టర్ వ్యవహారశైలిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది.
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం పెద్దమాడూరుకు చెందిన ఎం. కొమురయ్య తన భూమికి సంబంధించి కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ మంగళవారం విచారణ చేపట్టారు.
రెవెన్యూ వివాదాలకు సంబంధించిన దరఖాస్తులను పరిష్కరించేందుకు ఏఐని వినియోగించి ఉత్తర్వులు జారీ చేస్తున్నారన్న అంశంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేశారు.
