D News: Oct 31: ముడి పత్తి దిగుమతులపై కస్టమ్స్ సుంకం మినహాయింపు పొడిగింపు

దేశీయ మార్కెట్‌లో ముడి పత్తి లభ్యతను పెంచడంతో పాటు, వస్త్రాలు, రెడీమేడ్‌ దుస్తుల పరిశ్రమలపై ముడిసరుకు వ్యయ భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పత్తి దిగుమతులపై అమల్లో ఉన్న కస్టమ్స్‌ సుంకం మినహాయింపు గడువును మరో రెండు నెలలు పొడిగించింది. 2026 డిసెంబరు 31 వరకు ఈ మినహాయింపు కొనసాగనుంది.

అక్టోబరు 30న సవరణ నోటిఫికేషన్‌ జారీ

వాస్తవానికి పత్తి దిగుమతులపై సుంకం మినహాయింపు గడువు 2026 అక్టోబరు 31తో ముగియాల్సి ఉంది. అయితే, అక్టోబరు 30న నోటిఫికేషన్‌ నంబర్‌ 35/2026-కస్టమ్స్‌ ద్వారా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ గడువును పొడిగిస్తూ సవరణలు జారీ చేసింది. గతంలో 2026 మే 30న విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ఈ మార్పులు చేసింది.

కస్టమ్స్‌ చట్టం-1962లోని సెక్షన్‌ 25(1), ఫైనాన్స్‌ చట్టం-2021లోని సెక్షన్‌ 124 ప్రకారం ఈ సవరణ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని రెవెన్యూ విభాగం, సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇన్‌డైరెక్ట్‌ టాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌ (సీబీఐసీ) ద్వారా నోటిఫికేషన్‌ నంబర్‌ 19/2026-కస్టమ్స్‌కు సవరణలు చేసి గెజిట్‌లో ప్రచురించారు.

చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊరట

ఈ నిర్ణయంతో వస్త్ర, రెడీమేడ్‌ దుస్తుల తయారీదారులకు ముడిసరుకు సేకరణ ఖర్చులు తగ్గడంతో పాటు పత్తి సరఫరా మరింత స్థిరంగా ఉండే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా పత్తిపైనే ఎక్కువగా ఆధారపడే చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎస్‌ఎంఈలు) ఈ మినహాయింపు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూర్చనుంది.

పత్తి సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడం, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడం, దేశీయ వస్త్ర పరిశ్రమ పోటీతత్వాన్ని పెంచడం ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యాలని కేంద్రం వెల్లడించింది. ఉత్పత్తి ఖర్చులు తగ్గడం ద్వారా పరోక్షంగా వినియోగదారులకు కూడా ప్రయోజనం కలుగుతుందని పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *