D News: Oct 31: వ్యవసాయ రంగంలో క్లైమేట్ ఇంటెలిజెన్స్ విప్లవం.. యువతకు ఉపాధి అవకాశాలు

హైదరాబాద్: దేశంలో వ్యవసాయ, ఉద్యాన రంగాలు వాతావరణ మార్పులను సమర్థంగా ఎదుర్కొనేందుకు క్లైమేట్ ఇంటెలిజెన్స్ విప్లవం కీలక పాత్ర పోషించనుందని పర్యావరణ నిపుణులు అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఈ రంగం గ్రామీణ యువతకు విస్తృత ఉపాధి అవకాశాలను కల్పించనుందని పేర్కొన్నారు.

కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రాజేంద్రనగర్‌లోని ఉద్యాన కళాశాలలో అక్టోబర్ 30, 31 తేదీల్లో ‘క్లైమేట్ ఇంటెలిజెన్స్ రెవల్యూషన్, అగ్రిబిజినెస్ మోడలింగ్’ అంశంపై జాతీయ స్థాయి బ్రెయిన్‌స్టార్మింగ్ వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి మాట్లాడుతూ.. వాతావరణ మార్పుల కారణంగా ఏర్పడే ఎల్‌నినో, తుఫాన్లు వంటి ప్రకృతి విపత్తులను సమర్థంగా ఎదుర్కొనేందుకు కృత్రిమ మేధస్సు (ఏఐ) వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించాలని సూచించారు.

రైతులకు ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారం అందుబాటులో ఉంటే సాగు నిర్ణయాలను స్వయంగా తీసుకునే అవకాశం ఉంటుందని గోపి తెలిపారు. తద్వారా ఉత్పత్తి ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు పంట దిగుబడులను పెంచుకోవచ్చన్నారు. తెలంగాణలో 55 లక్షల మందికి పైగా రైతుల వివరాలతో డిజిటల్ క్రాప్ డేటాబేస్ అందుబాటులో ఉందని, భవిష్యత్తులో పంట రుణాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, వాతావరణ సమాచారాన్ని రైతులకు చేరవేయడంలో ఇది కీలకంగా ఉపయోగపడుతుందని వివరించారు. వాతావరణ అంచనాలు మరింత కచ్చితత్వంతో, క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా ఉండాలని ఆకాంక్షించారు.

ఆరు కిలోమీటర్ల రిజల్యూషన్ స్థాయికి వాతావరణ అంచనాలు

భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఔట్రీచ్ విభాగం సలహాదారు, అధిపతి డాక్టర్ జేవీ సింగ్ మాట్లాడుతూ.. గతంలో దీర్ఘకాలిక వాతావరణ అంచనాలు 150 కిలోమీటర్ల రిజల్యూషన్ స్థాయిలో ఉండేవని, ప్రస్తుతం సాంకేతిక అభివృద్ధితో ఆరు కిలోమీటర్ల రిజల్యూషన్ స్థాయికి చేరుకున్నామని తెలిపారు. హైపర్‌ఫార్మెన్స్ కంప్యూటర్ల అనుసంధానంతో వాతావరణ అంచనాల రంగంలో భారత్ ప్రపంచవ్యాప్తంగా నాలుగో స్థానంలో నిలిచిందన్నారు. పరిశోధనల ద్వారా సాధించిన ఫలితాలు భవిష్యత్తులో క్షేత్రస్థాయి రైతులకు పూర్తిస్థాయిలో చేరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఏఐతో అగ్రిబిజినెస్ మోడలింగ్‌కు కొత్త దిశ

వర్క్‌షాప్‌కు అధ్యక్షత వహించిన కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్ డాక్టర్ దండ రాజిరెడ్డి మాట్లాడుతూ.. 1980వ దశకంలో ప్రారంభమైన వాతావరణ అంచనా విధానాలు ప్రస్తుతం ఏఐ సాంకేతికతతో మరింత కచ్చితత్వాన్ని సాధిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అగ్రిబిజినెస్ మోడలింగ్‌తో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా వ్యవసాయ రంగంలో మెరుగైన ఫలితాలు సాధించడంతో పాటు రైతులకు మరింత ప్రయోజనం చేకూరుతుందని వివరించారు.

ఈ సందర్భంగా ‘క్లైమేట్ అనలిటిక్స్’, ‘క్లైమేట్ ఇంటెలిజెన్స్’ పుస్తకాలను ప్రముఖులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో వాతావరణ నిపుణులు, విశ్వవిద్యాలయ అధికారులు, ప్రొఫెసర్లు, రైతులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ జాతీయ స్థాయి వర్క్‌షాప్‌కు భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ సహకారం అందిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *