ఆదివారం వచ్చిందంటే చాలు.. నాన్‌వెజ్ ప్రియుల ఇంట్లో బిర్యానీలు, పులావ్‌లతో ప్రత్యేకమైన విందు సిద్ధమవుతుంది. ముఖ్యంగా రొయ్యలతో తయారుచేసే పులావ్‌కు ఉండే రుచే వేరు. ఘుమఘుమలాడే సుగంధంతో, మసాలాల రుచిని అద్దుకున్న రొయ్యల పులావ్‌ను ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. అయితే ఇంట్లో ఈ వంటకం తయారుచేసేటప్పుడు కొందరికి రొయ్యలు గట్టిపడటం, వాటి రుచి అన్నంలోకి పూర్తిగా చేరకపోవడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. కానీ కొన్ని సింపుల్ వంటింటి చిట్కాలు పాటిస్తూ, తాజాగా తయారుచేసిన ప్రత్యేక మసాలా పొడిని జోడిస్తే చాలు.. మంచి రుచితో, రెస్టారెంట్ స్టైల్‌లో నోరూరించే రొయ్యల పులావ్‌ను ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోవచ్చు. మరి ఆ రుచికరమైన పులావ్ తయారీ విధానం, పాటించాల్సిన మెళకువలు ఏమిటో తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:

ఈ రుచికరమైన రొయ్యల పులావ్ తయారీకి అర కేజీ రొయ్యలు, 20 నిమిషాల పాటు నానబెట్టిన 2 గ్లాసుల బియ్యం, 3½ గ్లాసుల నీళ్లు సిద్ధం చేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన 2 చిన్న ఉల్లిపాయలు, ఒక మీడియం సైజు టమాటా, 10–12 జీడిపప్పు పలుకులు, 2 బిర్యానీ ఆకులు, అర టీస్పూన్ షాజీరా, పావు టీస్పూన్ పసుపు, ఒక టీస్పూన్ కారం పొడి, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా తాజా పుదీనా, కొత్తిమీర అవసరం. వీటితో పాటు 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, వంట నూనె కూడా తీసుకోవాలి.

సుగంధ పులావ్ మసాలా పొడి కోసం:

ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టీస్పూన్ జీలకర్ర, ఒక టీస్పూన్ షాజీరా, అర టీస్పూన్ సోంపు, 3 యాలకులు, 5–6 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక టీస్పూన్ రాతిపువ్వు తీసుకోవాలి.

గ్రీన్ మసాలా పేస్ట్ కోసం:

15–20 వెల్లుల్లి రెబ్బలు, 1½ అంగుళాల అల్లం ముక్క, 5–6 పచ్చిమిర్చి, ఒక చిన్న కట్ట తాజా కొత్తిమీర సిద్ధం చేసుకోవాలి.

తయారీ విధానం:

1. రొయ్యలను సిద్ధం చేసుకోవడం: ముందుగా శుభ్రం చేసిన రొయ్యలను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. వాటిలో అర టీస్పూన్ ఉప్పు, పావు టీస్పూన్ పసుపు, ఒక టీస్పూన్ కారం పొడి వేసి బాగా కలపాలి. ఇలా కలిపిన రొయ్యలను సుమారు 10 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. అనంతరం స్టవ్‌పై పాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనె వేడిచేసి రొయ్యలను వేయాలి. వాటి నుంచి విడుదలైన నీరు పూర్తిగా ఇంకిపోయి, నూనె పైకి తేలే వరకు 3–4 నిమిషాలు వేయించి ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి.

2. మసాలా పొడి, గ్రీన్ పేస్ట్ తయారీ: ముందుగా మిక్సీ జార్‌లో ధనియాలు, జీలకర్ర, షాజీరా, సోంపు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, రాతిపువ్వు వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలా పొడిని పక్కన పెట్టాలి. అదే మిక్సీ జార్‌లో వెల్లుల్లి రెబ్బలు, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర కాడలతో సహా వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి.

ఇప్పుడు పులావ్ తయారుచేసే వెడల్పాటి పాత్రలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడిచేయాలి. అందులో బిర్యానీ ఆకులు, అర టీస్పూన్ షాజీరా, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయలు సగం వేగిన తర్వాత జీడిపప్పు పలుకులు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి.

3. రొయ్యల మసాలా తయారీ: వేగుతున్న ఉల్లిపాయల్లో ముందుగా తయారుచేసుకున్న అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్‌ను వేయాలి. అనంతరం తరిగిన టమాటా ముక్కలు వేసి మిశ్రమం బాగా మగ్గి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న రొయ్యలను వేసి, పావు టీస్పూన్ పసుపు, తగినంత ఉప్పు, ఒక టీస్పూన్ కారం పొడి, తయారుచేసిన సుగంధ మసాలా పొడిని కలపాలి. మసాలా అడుగంటకుండా రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి మూత పెట్టాలి. తక్కువ మంటపై సుమారు 2 నిమిషాల పాటు మగ్గించాలి.

4. పులావ్ ఉడికించడం: ముందుగా నానబెట్టిన బియ్యంలోని నీటిని పూర్తిగా వంపేసి, బియ్యాన్ని రొయ్యల మసాలాలో వేయాలి. బియ్యం విరిగిపోకుండా నెమ్మదిగా కలుపుతూ సుమారు 2 నిమిషాల పాటు వేయించాలి. అనంతరం రెండు గ్లాసుల బియ్యానికి 3½ గ్లాసుల నీళ్లు పోయాలి. బాస్మతి బియ్యం ఉపయోగిస్తే 3 గ్లాసుల నీళ్లు సరిపోతాయి. రుచికి తగినంత ఉప్పు, తాజా పుదీనా, కొత్తిమీర వేసి మరోసారి కలపాలి.

ఇప్పుడు మంటను ఎక్కువగా ఉంచి పాత్రపై మూత పెట్టి నీళ్లు బాగా మరిగించాలి. నీరంతా ఇంకిపోయి అన్నం దగ్గరపడిన తర్వాత మంటను పూర్తిగా తగ్గించి, మూత పెట్టి 5–6 నిమిషాల పాటు దమ్ చేయాలి. అన్నం పూర్తిగా ఉడికి తడి లేకుండా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి.

అంతే.. ఘుమఘుమలాడే సుగంధ మసాలాలతో నోరూరించే రొయ్యల పులావ్ సిద్ధం! వేడివేడిగా సర్వ్ చేస్తే రొయ్యల రుచి, మసాలాల సువాసన ప్రతి ముద్దలోనూ అద్భుతంగా ఉంటాయి. దీనిని నేరుగా తినవచ్చు లేదా ఉల్లిపాయ పెరుగు రైతాతో కలిపి ఆస్వాదించవచ్చు.