పూర్వకాలంలో సబ్బులు అందుబాటులో లేని రోజుల్లో మన అమ్మమ్మలు, నానమ్మలు వంటింట్లో లభించే సహజ పదార్థాలు, ఆయుర్వేద మూలికలతో ఇంట్లోనే సున్నిపిండిని తయారు చేసుకుని స్నానానికి ఉపయోగించేవారు. అయితే ప్రస్తుత రోజుల్లో రసాయనాలు కలిగిన కొన్ని సబ్బుల వల్ల చర్మం పొడిబారడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఇలాంటి సమయంలో సంప్రదాయ పద్ధతిలో తయారుచేసే సున్నిపిండి మంచి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. ఇది చర్మంపై పేరుకుపోయిన మురికి, మృతకణాలను తొలగించడంలో సహాయపడుతుంది. సహజమైన పదార్థాలతో తయారుచేసిన సున్నిపిండిని తగిన జాగ్రత్తలతో ఉపయోగిస్తే చర్మాన్ని శుభ్రంగా, తాజాగా ఉంచుకోవచ్చు.

కావలసిన పదార్థాలు: సున్నిపిండి తయారీకి ముందుగా అర కిలో ముడి పెసలు, అర కిలో పచ్చి శనగపప్పు, పావు కిలో ఎర్ర కందిపప్పు, 250 గ్రాముల బియ్యం, 100 గ్రాముల మెంతులు, 50 గ్రాముల వేపాకులు, 5 కప్పుల ఎండిన నాటు గులాబీ రేకులు, 50 గ్రాముల ఎండిన ఉసిరి ముక్కలు, 20 గ్రాముల వట్టివేర్లు, 25 గ్రాముల బావంచాలు, 50 గ్రాముల గంధ కచోరాలు, 50 గ్రాముల తుంగగడ్డలు, 100 గ్రాముల కస్తూరి పసుపు కొమ్ములు, 2 కప్పుల ముల్తానీ మట్టి తీసుకోవాలి. అదనపు సువాసన, ప్రయోజనాల కోసం ఎండిన నిమ్మతొక్కలు, తులసి ఆకులు కూడా అందుబాటులో ఉంటే కలుపుకోవచ్చు.

తయారీ విధానం: ముందుగా అన్ని పదార్థాలను ఒకరోజంతా ఎండలో ఆరబెట్టుకోవాలి. ఎండ అందుబాటులో లేనప్పుడు పెసలు, శనగపప్పు, ఎర్ర కందిపప్పు, బియ్యం, మెంతులను పాన్‌లో వేసి లో ఫ్లేమ్‌పై సుమారు ఐదు నిమిషాల పాటు తేలికగా వేడిచేయాలి. వీటిని దోరగా వేయించాల్సిన అవసరం లేదు. పదార్థాల్లోని తేమ తగ్గించడమే దీని ఉద్దేశం. అనంతరం అదే పాన్‌లో వేపాకులను చేత్తో నలిపితే పొడయ్యేంత వరకు వేడి చేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మిగిలిన వేడిలో ఎండిన గులాబీ రేకులను కూడా కొద్దిసేపు ఉంచి తీసేయాలి.

తర్వాత ఒక పెద్ద బేసిన్‌లో వేడిచేసిన పప్పులు, బియ్యం, మెంతులతో పాటు ఎండిన ఉసిరి ముక్కలు, వట్టివేర్లు, బావంచాలు, గంధ కచోరాలు, తుంగగడ్డలు, కస్తూరి పసుపు కొమ్ములు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఫ్యాన్ కింద పూర్తిగా చల్లారనివ్వాలి. అనంతరం కొద్దికొద్దిగా మిక్సీలో వేసి మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువ మొత్తంలో తయారు చేసుకోవాలనుకుంటే మిల్లులో కూడా ఆడించుకోవచ్చు.

తయారైన పొడిని జల్లెడ పట్టి శనగపిండిలా నునుపుగా చేసుకోవాలి. జల్లెడలో మిగిలిన బరక పొడిని మళ్లీ మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. చివరగా ఈ పొడిలో రెండు కప్పుల ముల్తానీ మట్టిని కలిపి, మిశ్రమమంతా సమానంగా కలిసేలా బాగా మిక్స్ చేయాలి. ముల్తానీ మట్టి చర్మంపై అదనపు జిడ్డును తొలగించడంలో సహాయపడుతుంది.

నిల్వ చేసుకునే విధానం: సిద్ధమైన సున్నిపిండిని పూర్తిగా తేమలేని, గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. తేమ తగలకుండా జాగ్రత్తపడితే ఎక్కువకాలం ఉపయోగించుకోవచ్చు. రోజువారీ అవసరానికి కొంత పిండిని విడిగా తీసుకుని వాడుకోవడం మంచిది. స్నాన సమయంలో ఈ సున్నిపిండిని ఉపయోగించుకోవచ్చు. అయితే ప్రతి ఒక్కరి చర్మతత్వం ఒకేలా ఉండదు కాబట్టి ముందుగా కొద్దిగా తీసుకుని ప్యాచ్ టెస్ట్ చేయాలి. ముఖ్యంగా సున్నితమైన చర్మం, అలర్జీలు ఉన్నవారు జాగ్రత్తగా ఉపయోగించాలి. చిన్నపిల్లలకు వాడే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.