D News: Oct 31: హైదరాబాద్‌లో గర్ల్స్ హాస్టల్ ముసుగులో అక్రమ ఫెర్టిలిటీ రాకెట్ గుట్టురట్టు

హైదరాబాద్: నగరంలోని బేగంపేట ప్రాంతంలో గర్ల్స్ హాస్టల్ ముసుగులో సాగుతున్న అక్రమ ఫెర్టిలిటీ రాకెట్‌ను పోలీసులు వెలుగులోకి తెచ్చారు. ప్రకాశ్ నగర్‌లోని ‘అమినీత గర్ల్స్ హాస్టల్‌’పై బేగంపేట పోలీసులు, మల్కాజ్‌గిరి స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT) సంయుక్తంగా ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో హాస్టల్ కేంద్రంగా సాగుతున్న అక్రమ కార్యకలాపాలు బయటపడినట్లు పోలీసులు గుర్తించారు.

ఇతర రాష్ట్రాల యువతుల నుంచి అండాల సేకరణ

పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, ఈ ముఠా సుమారు ఏడాది కాలంగా గర్ల్స్ హాస్టల్ పేరుతో అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. బిహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా తదితర రాష్ట్రాలకు చెందిన నిరుపేద యువతులను వివిధ ఆశలు చూపించి హైదరాబాద్‌కు రప్పించినట్లు సమాచారం. వారి నుంచి బలవంతంగా లేదా ప్రలోభాలకు గురిచేసి అండాలను (Oocytes) సేకరించి, నగరంలోని పలు సంతాన సాఫల్య కేంద్రాలకు అక్రమంగా విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, కొందరు పురుషుల నుంచి వీర్య నమూనాలను కూడా సేకరిస్తున్నట్లు పోలీసులకు ఆధారాలు లభించినట్లు సమాచారం.

పది మంది యువతుల గుర్తింపు.. పోలీసుల దర్యాప్తు

ఈ సంయుక్త దాడుల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు పది మంది యువతులను పోలీసులు గుర్తించి రక్షించినట్లు సమాచారం. ప్రస్తుతం వారిని సురక్షిత ప్రాంతంలో ఉంచి విచారిస్తున్నారు. బాధితుల నుంచి సేకరించే వివరాల ఆధారంగా ఈ వ్యవహారంలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

గర్ల్స్ హాస్టల్ ముసుగులో ఇలాంటి అక్రమ కార్యకలాపాలు సాగుతున్నట్లు వెలుగులోకి రావడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. ఈ అక్రమ నెట్‌వర్క్ వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులు ఎవరు? నగరంలోని ఏయే ఫెర్టిలిటీ సెంటర్లకు ఈ వ్యవహారంతో సంబంధాలున్నాయి? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *