D Educt: Oct 30: జేఎన్‌టీయూహెచ్‌లో 100 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు

తమ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు మంజూరు చేయాలని జేఎన్‌టీయూహెచ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరనుంది. ఈ మేరకు సుమారు 100 పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వాలని యూనివర్సిటీ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటితోపాటు పదుల సంఖ్యలో ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి కూడా అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించనున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఏడు విశ్వవిద్యాలయాల పరిధిలో 429 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకానికి అనుమతి ఇచ్చింది.

అయితే రాష్ట్రంలోని అతిపెద్ద విశ్వవిద్యాలయమైన జేఎన్‌టీయూహెచ్‌కు, దాని పరిధిలోని తొమ్మిది ఇంజినీరింగ్‌ కళాశాలలకు ఒక్క అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టు కూడా మంజూరు కాలేదు. ఈ అంశంపై ‘భవనాలు లేవు.. బోధకులూ లేరు’ అనే శీర్షికతో అక్టోబరు 26న ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది.

ఈ నేపథ్యంలో యూనివర్సిటీ అధికారులు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి ఖాళీలపై అధ్యయనం చేయించారు. ఈ కమిటీ సుమారు 90 నుంచి 100 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకానికి అవకాశం ఉందని గుర్తించింది. దీంతో ఆ పోస్టులను మంజూరు చేయాలని కోరుతూ అక్టోబరు 30 లేదా 31న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *