D News: Oct 29: ఈమెయిల్ ద్వారా 250 మంది ఉద్యోగులను తొలగించిన అమెజాన్

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ మరోసారి ఉద్యోగుల కోతలకు తెరతీసింది. తన డివైసెస్ అండ్ సర్వీసెస్ విభాగంలో సుమారు 250 మంది ఉద్యోగులను తొలగించింది. కొత్త కిండిల్ ఇ-రీడర్లు, టాబ్లెట్ కంప్యూటర్లతో సహా పలు ఉత్పత్తులను వరుసగా విడుదల చేసిన కొన్ని వారాలకే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. రాయిటర్స్‌ విచారణ అనంతరం సంస్థ ఈ ఉద్యోగుల తొలగింపులను ధృవీకరించింది.

ఉద్యోగుల కోతలపై అమెజాన్‌ ప్రతినిధి స్పందిస్తూ.. కొంతమంది ఉద్యోగులను తొలగించాలనే కఠినమైన నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అయితే, దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించలేదు. సంస్థ మరింత సమర్థవంతంగా పనిచేయడంతో పాటు, తమ ఉత్పత్తుల భవిష్యత్‌ ప్రణాళికలకు అనుగుణంగా కార్యకలాపాలను మెరుగుపరచుకునేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, బుధవారం అలెక్సాతో పనిచేసే కొత్త అలారం క్లాక్‌, ఫోటో ఫ్రేమ్‌లను కూడా అమెజాన్‌ ప్రకటించింది.

‘డివైసెస్ అండ్ సర్వీసెస్’ విభాగంలో ఉద్యోగుల కోతలు

అమెజాన్‌ తన సాధారణ విధానంలో భాగంగా బుధవారం తెల్లవారుజామున ఉద్యోగులకు టెక్స్ట్‌ మెసేజ్‌లు, ఈమెయిల్‌ల ద్వారా తొలగింపుల సమాచారాన్ని పంపింది. రాయిటర్స్‌ పరిశీలించిన ఓ సందేశంలో, ‘డివైసెస్ అండ్ సర్వీసెస్’ విభాగం మానవ వనరుల విభాగం ఉపాధ్యక్షురాలు చెరీ రాబిన్సన్‌ సంస్థాగత నిర్మాణాన్ని సమగ్రంగా సమీక్షించినట్లు పేర్కొన్నారు. ఈ సమీక్షలో భాగంగానే ఉద్యోగుల సంఖ్యను తగ్గించాల్సిన అవసరం ఏర్పడిందని ఆమె వివరించారు.

రిటైల్ విభాగంలోనూ ఉద్యోగుల కోతలు

అమెజాన్‌ ఇటీవల తన ప్రధాన రిటైల్‌ విభాగంలో కూడా సుమారు 1,000 ఉద్యోగాలను తగ్గించినట్లు సమాచారం. వరుసగా వివిధ విభాగాల్లో ఉద్యోగుల కోతలు చోటుచేసుకోవడం సంస్థలోని ఉద్యోగులపై ప్రభావం చూపుతోంది. మరోవైపు, గురువారం మార్కెట్‌ ముగిసిన తర్వాత అమెజాన్‌ తన మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను వెల్లడించనుంది. ఈ ఫలితాలపై పెట్టుబడిదారులు, మార్కెట్‌ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.