D News: Oct 29: దీపావళి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని ప్రముఖ స్వీట్‌ షాపులు, మిఠాయిల తయారీ కేంద్రాలపై ఆహార భద్రతా అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నగరంలోని పలు సంస్థల్లో అపరిశుభ్ర వాతావరణంలో మిఠాయిలు తయారు చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఈ తనిఖీల్లో భాగంగా సనత్‌నగర్‌లోని జి. పుల్లారెడ్డి స్వీట్స్‌ తయారీ కేంద్రం ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్‌ను సస్పెండ్ చేసినట్లు సమాచారం.

టీజీ సేఫ్‌, పోలీసు విభాగాలకు చెందిన 13 ప్రత్యేక బృందాలు జీహెచ్‌ఎంసీ పరిధిలోని 16 ప్రధాన స్వీట్‌ షాపులపై ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో సుమారు రూ.16.86 లక్షల విలువైన 3,546 కిలోల కల్తీ, పాడైపోయిన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన ఐదు సంస్థల లైసెన్సులను సస్పెండ్ చేయగా, సరైన లైసెన్సులు లేకుండా నిర్వహిస్తున్న మరో ఐదు దుకాణాలను మూసివేయించినట్లు తెలిపారు.

సనత్‌నగర్‌లోని జి. పుల్లారెడ్డి స్వీట్స్‌ తయారీ కేంద్రంలో తనిఖీలు నిర్వహించిన అధికారులకు కుళ్లిన కూరగాయలు, ఎలుకల వ్యర్థాలు, గడువు ముగిసిన ముడిసరుకులు కనిపించినట్లు సమాచారం. వంటగది, పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటాన్ని గుర్తించిన అధికారులు అక్కడి నుంచి రూ.15.03 లక్షల విలువైన 3,133 కిలోల ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఆహార పదార్థాల తయారీ, నిల్వలో పరిశుభ్రతా ప్రమాణాలు పాటించకపోవడంపై అధికారులు తీవ్రంగా స్పందించారు.

ఇతర ప్రాంతాల్లోనూ అధికారులు తనిఖీలు చేపట్టి పలు సంస్థలపై చర్యలు తీసుకున్నారు. చార్మినార్‌లోని ఆగ్రా మిఠాయి ఘర్‌, వనస్థలిపురంలోని స్వీట్‌ వన్‌ రుచులు, ఫలక్‌నుమాలోని బాలాజీ శ్రీ కిషన్‌ మిఠాయి భండార్‌, కాటేదాన్‌లోని హిరాణి ఫుడ్స్‌ లైసెన్సులను సస్పెండ్ చేసినట్లు సమాచారం. అలాగే చాంపాపేటలోని బాలాజీ స్వీట్స్‌, సికింద్రాబాద్‌లోని మమతా స్వీట్‌ హౌస్‌తో పాటు మరో మూడు దుకాణాలను సీజ్‌ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

తనిఖీల సందర్భంగా మొత్తం 22 ఆహార నమూనాలను సేకరించి పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించారు. వాటి నివేదికలు అందిన తర్వాత నిబంధనల ఉల్లంఘనల తీవ్రతను బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. పండుగల సమయంలో ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహార పదార్థాలు అందేలా తనిఖీలను మరింత విస్తృతం చేయనున్నట్లు తెలిపారు.