D Spiritual: Oct 29: శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల దర్శనార్థం విచ్చేసిన చెంచు గిరిజన భక్తులకు దేవస్థానం ఉచిత స్పర్శదర్శన సౌకర్యాన్ని కల్పించింది. ప్రతి నెలా చివరి బుధవారం రోజున చెంచు గిరిజనులకు ప్రత్యేకంగా ఉచిత స్పర్శదర్శనం కల్పించాలన్న నిర్ణయంలో భాగంగా బుధవారం 250 మంది గిరిజన భక్తులకు శ్రీ స్వామివారి స్పర్శదర్శనంతో పాటు అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పించారు. స్థానిక చెంచు గూడేలతో పాటు పల్నాడు, మార్కాపురం జిల్లాల నుంచి వచ్చిన గిరిజన భక్తులు ఈ ప్రత్యేక దర్శనంలో పాల్గొన్నారు.

చెంచు గిరిజన భక్తులు బుధవారం ఉదయం సంప్రదాయ వాయిద్యాలైన తప్పెటలను వాయిస్తూ, తమ సంప్రదాయ నృత్యాలు చేస్తూ దర్శనానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఉమారామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద దేవస్థానం సిబ్బంది వారికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం భక్తులకు శ్రీ స్వామివారి ఉచిత స్పర్శదర్శనంతో పాటు శ్రీ భ్రమరాంబా అమ్మవారి దర్శనాన్ని కల్పించారు.

దర్శనం పూర్తి చేసుకున్న చెంచు గిరిజన భక్తులందరికీ దేవస్థానంలోని అన్నపూర్ణా ప్రసాద వితరణ భవనంలో అన్నప్రసాదాలను ఏర్పాటు చేశారు. చెంచు గిరిజన భక్తులను ప్రత్యేక దర్శనానికి ఎంపిక చేసే ప్రక్రియలో స్థానిక ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సహకారాన్ని దేవస్థానం అధికారులు తీసుకున్నారు. చెంచు గిరిజన భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందించడంతో పాటు వారి సంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తూ, ప్రతి నెలా చివరి బుధవారం ప్రత్యేక ఉచిత స్పర్శదర్శనం కల్పించే కార్యక్రమాన్ని దేవస్థానం అమలు చేస్తోంది.