
D Educt: Oct 27: ఏఈఈ, ఎస్ఎస్సీ జేఈ పరీక్షలు ఒకేరోజు.. అభ్యర్థులకు టీజీపీఎస్సీ వెసులుబాటు
హైదరాబాద్: తెలంగాణ రోడ్లు, భవనాల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ), స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) జూనియర్ ఇంజినీర్ (జేఈ) రాతపరీక్షలు నవంబరు 6న ఒకేరోజు షెడ్యూల్ కావడంతో అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తకుండా టీజీపీఎస్సీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. రెండు పరీక్షలకు ఒకేరోజు హాజరుకావాల్సిన అభ్యర్థులు అక్టోబరు 30న సాయంత్రం 5 గంటల్లోగా టీజీపీఎస్సీ సహాయ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దరఖాస్తుతో పాటు రెండు పరీక్షల హాల్‌టికెట్లు, టీజీపీఎస్సీ వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) కాపీని సమర్పించాలని తెలిపింది.
నవంబరు 7న ఏఈఈ పరీక్షకు అవకాశం
రెండు పరీక్షల తేదీలు ఒకేరోజు ఉన్న అభ్యర్థులకు ఏఈఈ రాతపరీక్షను నవంబరు 7న నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామని టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. అభ్యర్థులు తమ వివరాలు, సంబంధిత పత్రాలను helpdesk@tgpsc.gov.in ఈ-మెయిల్ చిరునామాకు కూడా పంపవచ్చని సూచించారు. నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల విజ్ఞప్తులను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఎస్ఎస్సీ ఛైర్మన్‌తో సంప్రదింపులు
రోడ్లు, భవనాల శాఖలో ఏఈఈ పోస్టుల రాతపరీక్షలను టీజీపీఎస్సీ నవంబరు 6, 7 తేదీల్లో నిర్వహించేలా షెడ్యూల్ ప్రకటించింది. మరోవైపు, ఎస్ఎస్సీ జూనియర్ ఇంజినీర్ పరీక్షలు నవంబరు 2 నుంచి 6 వరకు జరగనున్నాయి. దీంతో రెండు పరీక్షలకు దరఖాస్తు చేసిన కొందరు అభ్యర్థులకు పరీక్షల తేదీలు ఒకేరోజు వచ్చాయి.
ఈ సమస్య పరిష్కారం కోసం టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం ఎస్ఎస్సీ ఛైర్మన్‌తో సంప్రదింపులు జరిపారు. తెలంగాణ అభ్యర్థులకు సాధ్యమైనంత వరకు నవంబరు 4, 5 తేదీల్లో పరీక్షలు కేటాయిస్తామని ఎస్ఎస్సీ ఛైర్మన్ హామీ ఇచ్చినట్లు తెలిపారు.
అభ్యర్థులకు అన్యాయం జరగకుండా చర్యలు
సంప్రదింపులు జరిగినప్పటికీ కొందరు అభ్యర్థులకు ఎస్ఎస్సీ జేఈ పరీక్ష నవంబరు 6న కేటాయిస్తూ హాల్‌టికెట్లు రావడంతో వారు టీజీపీఎస్సీ ఛైర్మన్‌ను సంప్రదించారు. ఈ నేపథ్యంలో ఎవరికీ అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని బుర్రా వెంకటేశం భరోసా ఇచ్చారు.
రెండు పరీక్షలు ఒకేరోజు ఉన్న అభ్యర్థులు గడువులోగా కమిషన్‌కు విజ్ఞప్తులు అందజేస్తే, వారి పరిస్థితిని పరిశీలించి ఏఈఈ పరీక్షను నవంబరు 7న నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. అభ్యర్థులు గడువును దృష్టిలో ఉంచుకుని హాల్‌టికెట్లు, ఓటీఆర్ కాపీతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
