
D Spiritual: Oct 27: శ్రీశైలం ఆలయ హుండీ ఆదాయం రూ.4.22 కోట్లు
శ్రీశైలం: శ్రీశ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దేవస్థానానికి హుండీ కానుకల ద్వారా రూ.4,22,29,240 ఆదాయం లభించింది. సెప్టెంబరు 24 నుంచి అక్టోబరు 25 వరకు 32 రోజుల పాటు భక్తులు సమర్పించిన కానుకలను సోమవారం లెక్కించారు.
హుండీ కానుకల్లో 75 గ్రాముల 300 మిల్లీగ్రాముల బంగారం, 2 కిలోల 900 గ్రాముల వెండి లభించాయి. వీటితోపాటు అమెరికా డాలర్లు 417, యూఏఈ దిర్హమ్స్ 65, ఇంగ్లాండ్ పౌండ్లు 60, కెనడా డాలర్లు 100, ఒమన్ బైసాలు 500, ఒమన్ రియాల్ ఒకటి, యూరోలు 25, మలేషియా రింగిట్లు రెండు, సౌదీ రియాళ్లు 10, న్యూజిలాండ్ డాలర్లు 10, సింగపూర్ డాలర్లు రెండు, ఈజిప్టు పౌండ్లు 10 తదితర విదేశీ కరెన్సీని గుర్తించారు.
హుండీల లెక్కింపు ప్రక్రియను పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య, సీసీ కెమెరాల నిఘాలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు శ్రీ పోతుగుంట రమేష్‌నాయుడు, కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం. శ్రీనివాసరావు పర్యవేక్షించారు.
ఈ లెక్కింపు కార్యక్రమంలో డిప్యూటీ కార్యనిర్వహణాధికారి శ్రీ ఎస్. చంద్రశేఖర్‌తోపాటు వివిధ విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, దేవస్థానం సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు.
