
D News: Oct 24: ఢిల్లీ మెట్రోలో ప్రభుత్వ పనితీరును ప్రశ్నిస్తూ పోస్టర్లు.. గుర్తుతెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు
ఢిల్లీ మెట్రో ఎయిర్పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్‌లోని ఓ రైలు లోపల ప్రభుత్వ పనితీరును ప్రశ్నిస్తూ, వివిధ సామాజిక సమస్యలను ప్రస్తావిస్తూ రెండు పోస్టర్లు అంటించడం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి గుర్తుతెలియని వ్యక్తులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ పోస్టర్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు, వాటిని రైలులో అంటించిన వ్యక్తులను గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు విచారణలో స్పెషల్ సెల్ కూడా పాల్గొంటున్నట్లు సమాచారం.
ఏ4 సైజులో ఉన్న ఆ నలుపు-తెలుపు పోస్టర్లపై “మీ జీవితాన్ని మీరే మార్చుకోవచ్చు”, “ఓటింగ్ నిరసన”, “వివిధ రంగాలలో భాగస్వామ్యం”, “సమాజ నిర్మాణ సంస్కరణలు”, “అసంతృప్తిగా ఉన్నారా? మీరు ఒంటరి కాదు” వంటి నినాదాలు ఉన్నాయి. అంతేకాకుండా, ఇటీవలి సంవత్సరాల్లో దేశంలో చోటుచేసుకున్న మార్పులకు సంబంధించి తొమ్మిది అంశాలను కూడా ఆ పోస్టర్లలో ప్రస్తావించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి ఆన్లైన్ గ్రూపులో చేరాలని ప్రజలను ఆహ్వానించేలా పోస్టర్లను రూపొందించినట్లు పేర్కొన్నాయి.
ఎఫ్ఐఆర్లో ఏముంది?
ఎఫ్ఐఆర్ ప్రకారం, అక్టోబర్ 20న ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC)కు చెందిన ఎయిర్పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్లో రైలు ఆపరేటర్‌గా పనిచేస్తున్న తరుణ్ చౌదరి విధుల్లో ఉన్న సమయంలో ఈ పోస్టర్లను గుర్తించారు. సాయంత్రం 6.50 గంటల ప్రాంతంలో న్యూఢిల్లీ స్టేషన్ నుంచి యశోభూమి స్టేషన్‌కు బయలుదేరిన రైలు, సుమారు 7.15 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంది.
రైలు గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత క్యాబిన్ లోపలి నుంచి తనిఖీ చేస్తుండగా, ఒక సీటుపై అంటించిన రెండు పోస్టర్లు తరుణ్ చౌదరి దృష్టికి వచ్చాయి. వెంటనే వాటిని తొలగించి, తన ఉన్నతాధికారులతో పాటు ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్‌కు సమాచారం అందించినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. అనంతరం ఆ పోస్టర్లను ద్వారకా సెక్టార్-21లోని స్టేషన్ కంట్రోలర్‌కు అప్పగించాలని ఆయనకు ఆదేశాలు అందాయి.
స్టేషన్ కంట్రోలర్‌కు పోస్టర్లు అందిన తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రైలు లోపల పోస్టర్లను ఎవరు అంటించారు? వాటి వెనుక ఎవరున్నారు? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. పోస్టర్లలోని నినాదాలు, క్యూఆర్ కోడ్ ద్వారా ప్రజలను ఆన్లైన్ గ్రూపులోకి ఆహ్వానించిన అంశాలపై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
