
D Spiritual: Oct 24: నాగర్ కర్నూల్: జిల్లాలోని బిజినపల్లి మండలం పాలెం గ్రామంలో వెలసిన శ్రీ అలివేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం చుట్టూ ప్రతి శనివారం ఆలయ ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, ఆలయ అధికారి తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఆలయ ప్రదక్షిణ కార్యక్రమంతో పాటు పల్లకి సేవ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించి, భక్తిశ్రద్ధలతో స్వామివారిని సేవించుకోవాలని నిర్వాహకులు సూచించారు. వరుసగా ఏడు శనివారాల పాటు ప్రతి శనివారం ఏడు ప్రదక్షిణలు చేయడం ద్వారా స్వామివారి అనుగ్రహంతో కోరిన కోరికలు నెరవేరుతాయని గ్రామస్తుల నమ్మకమని తెలిపారు.
పాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పుగా విరాజిల్లుతున్న నేపథ్యంలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. భక్తులు స్వామివారి పల్లకి సేవలో పాల్గొని దర్శనం చేసుకోవడంతో పాటు తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని విజ్ఞప్తి చేశారు.
