
D Educt: Oct 21: ITBPలో కానిస్టేబుల్ ఉద్యోగాలు.. 126 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
స్పోర్ట్స్ కోటాలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) స్పోర్ట్స్ కోటా కింద కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, ఫుట్బాల్, జూడో, వాలీబాల్ సహా మొత్తం 28 క్రీడా విభాగాల్లో మహిళలు, పురుషుల నుంచి 126 ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
విద్యార్హతలు, వయోపరిమితి
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి (మెట్రిక్యులేషన్) ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
నెలకు రూ.69,100 వరకు వేతనం
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ ప్రకారం నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు వేతనం అందుతుంది. దరఖాస్తు రుసుముగా జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన పురుష అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు.
ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది?
అభ్యర్థుల ఎంపికలో భాగంగా ధ్రువపత్రాల పరిశీలన, శారీరక ప్రమాణాల పరీక్ష (PST), స్పోర్ట్స్ ట్రయల్ టెస్ట్, మెరిట్ జాబితా తయారీ, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆయా పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులను నిబంధనల ప్రకారం ఎంపిక చేస్తారు.
దరఖాస్తు గడువు
అర్హతలు కలిగిన ఆసక్తిగల అభ్యర్థులు అక్టోబర్ 3 నుంచి నవంబర్ 1వ తేదీ వరకు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ను పరిశీలించి, విద్యార్హతలు, క్రీడా అర్హతలు, వయోపరిమితి, దరఖాస్తు విధానం వంటి వివరాలను నిర్ధారించుకోవాలి.
