
D NEWS: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజానికి తీరని ద్రోహం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో నీరు లేకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎల్ నినో పేరుతో ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పుకుంటోందని మండిపడ్డారు.
శనివారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు దేవాదుల ప్రాజెక్టుపై ప్రశ్నలు లేవనెత్తారు. అక్కడ 10 మోటార్లు ఉన్నప్పటికీ మూడు మాత్రమే పనిచేస్తున్నాయని తెలిపారు. బీఆర్ఎస్ అభ్యంతరాలు వ్యక్తం చేసిన తర్వాతే ప్రభుత్వం స్పందించిందని విమర్శించారు.
తెలంగాణలో కరువు పరిస్థితులకు సీఎం రేవంత్ రెడ్డి కారణమని హరీశ్ రావు ఆరోపించారు. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో తక్కువ వర్షపాతం నమోదైనా అక్కడ కరువు, క్రాప్ హాలిడే పరిస్థితులు లేవని అన్నారు. అయితే, నీటి నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం మరింత శ్రద్ధ చూపాలని డిమాండ్ చేశారు.
గోదావరి జలాలను ఇతర ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని హరీశ్ రావు ఆరోపించారు. గోదావరి–బనకచర్ల, గోదావరి–నల్లమలసాగర్ ప్రతిపాదనల తర్వాత ఇప్పుడు గోదావరి–కావేరి లింక్ పేరుతో కొత్త ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ విషయంలో చంద్రబాబు ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారని విమర్శించారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ నేతలు ఇలాంటి ప్రతిపాదనలు చేయలేదని హరీశ్ రావు అన్నారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాతే కొత్త ప్రతిపాదనలు తెస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ నీటి ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు.
