
D NEWS: హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోంది. బూత్ స్థాయి నుంచే ఓటరు నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. గాంధీభవన్‌లో హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు.
ఈ సమావేశంలో ఏఐసీసీ ఇన్చార్జి కార్యదర్శి సచిన్ సావంత్, డీసీసీ అధ్యక్షులు మోత రోహిత్, దీపక్ జాన్‌తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. నగరంలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జిలు, పీసీసీ కోఆర్డినేటర్లు కూడా హాజరయ్యారు. ఎన్నికల కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు.
2023 అక్టోబర్ 31 నాటికి లేదా అంతకంటే ముందు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారు ఓటరు నమోదుకు అర్హులని పొన్నం ప్రభాకర్ తెలిపారు. అర్హులైన పట్టభద్రులు వెంటనే తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. గతంలో ఓటరుగా నమోదైనవారు కూడా తమ వివరాలను సరిచూసుకోవాలని సూచించారు.
కోర్టులు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ప్రైవేటు సంస్థలను సందర్శించి పట్టభద్రులకు అవగాహన కల్పించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, న్యాయవాదుల సమస్యలను శాసనమండలిలో బలంగా వినిపించడం తమ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ఉద్యోగ ఖాళీల భర్తీ, ఉద్యోగుల సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు.
కాంగ్రెస్ బలపరిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామమోహన్రెడ్డిని గెలిపించేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని 15 నియోజకవర్గాల్లో ఓటరు నమోదు కార్యక్రమాన్ని విస్తరించాలని సూచించారు. పట్టభద్రులంతా ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములై ఓటు హక్కును నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
