D Educt: Oct 16: పారామెడికల్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల.. అక్టోబరు 24 చివరి తేదీ

రాష్ట్రంలో పారామెడికల్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం తెలంగాణ రాష్ట్ర పారామెడికల్‌ బోర్డు (టీజీపీఎంబీ) ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు అక్టోబరు 24వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని బోర్డు సూచించింది. ప్రవేశ ప్రక్రియలో భాగంగా కౌన్సెలింగ్‌ పూర్తి చేసి, విద్యార్థుల ఎంపికను అక్టోబరు 31వ తేదీలోగా పూర్తి చేయనున్నారు.

ఎంపికైన విద్యార్థులు నవంబరు 10వ తేదీన సంబంధిత కళాశాలల్లో చేరాల్సి ఉంటుందని, నవంబరు 11 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయని బోర్డు కార్యదర్శి మంజునాథ్‌ అక్టోబరు 15న విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు నిర్ణీత గడువులోగా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసి, ప్రవేశాలకు సంబంధించిన మార్గదర్శకాలను పాటించాలని సూచించారు.

కన్వీనర్‌ కోటాలో విద్యార్థులను మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేయనున్నట్లు బోర్డు కార్యదర్శి స్పష్టం చేశారు. ఈ ప్రక్రియను నిర్వహించేందుకు జిల్లా వైద్యాధికారి నేతృత్వంలో నలుగురు సభ్యులతో కూడిన కమిటీలను జిల్లాల వారీగా ఏర్పాటు చేసి కొనసాగించనున్నట్లు తెలిపారు. ఈ కమిటీలు విద్యార్థుల మెరిట్‌ను పరిశీలించి, ప్రవేశాల ప్రక్రియను పర్యవేక్షించనున్నాయి.