D Educt: Oct 15: ప్రభుత్వ ఉద్యోగాలు, వివిధ విద్యాసంస్థల్లో క్రీడా కోటా కింద ప్రవేశాల భర్తీకి నైపుణ్య పరీక్ష (స్కిల్‌ టెస్ట్‌)ను రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి చేయనుంది. ఈ మేరకు కూటమి ప్రభుత్వం రాష్ట్ర క్రీడా విధానంలో కీలక సవరణలు చేయనుంది. ఇప్పటికే రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌) బోర్డు ఈ అంశంపై తీర్మానం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇటీవల ప్రకటించిన ఏపీపీఎస్సీ, డీఎస్సీ తుది నోటిఫికేషన్లు వెలువడేలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.

ఆయా నోటిఫికేషన్లలో స్కిల్‌ టెస్ట్‌ ప్రతిపాదనను చేర్చేలా సంబంధిత నియామక బోర్డులకు శాప్‌ లేఖలు రాయనుంది. ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్న 1,466 ఉద్యోగాల్లో 44 పోస్టులను, డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్న 2,721 ఉపాధ్యాయ పోస్టుల్లో 82 పోస్టులను క్రీడా కోటా కింద భర్తీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో క్రీడా కోటా అభ్యర్థుల నైపుణ్యాన్ని పరీక్షించేందుకు శాప్‌ ఈ చర్యలు చేపట్టింది.

క్రీడలకు సంబంధించిన సాంకేతిక నిపుణులు, ఫిజికల్‌ డైరెక్టర్లు, శాప్‌ అధికారులతో కూడిన ప్రత్యేక కమిటీ స్కిల్‌ టెస్ట్‌ నిర్వహించనుంది. సంబంధిత క్రీడాంశంలో అభ్యర్థికి ఉన్న నైపుణ్యాన్ని కమిటీ సభ్యులు పరీక్షించి, ఆ పోస్టు లేదా ప్రవేశానికి వారు అర్హులో కాదో నిర్ధారించనున్నారు.

న్యాయస్థానాలను ఆశ్రయించడంతో నిర్ణయం

ఇటీవల ఎంబీబీఎస్‌, ఇంజినీరింగ్‌ కోర్సుల్లో క్రీడా కోటా ప్రవేశాల సందర్భంగా శాప్‌ నైపుణ్య పరీక్ష నిర్వహించింది. అయితే, క్రీడా విధానంలో లేదా సంబంధిత నోటిఫికేషన్‌లో స్కిల్‌ టెస్ట్‌ నిర్వహించాలనే నిబంధన లేనప్పుడు పరీక్ష ఎలా నిర్వహిస్తారని ప్రశ్నిస్తూ పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఈ పరిణామాల నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా క్రీడా విధానంలోనే నైపుణ్య పరీక్ష నిబంధనను చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.

క్రీడా కోటా కింద సంబంధిత పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ క్రీడా ధ్రువపత్రాలను యాప్‌లో తప్పనిసరిగా అప్‌లోడ్‌ చేయాలి. ఈ సర్టిఫికెట్లు అసలైనవా, కాదా అని నిర్ధారించేందుకు శాప్‌ ఇప్పటివరకు వాటిని సంబంధిత క్రీడా సంఘాలు, సమాఖ్యలకు ఆఫ్‌లైన్‌ ద్వారా పంపిస్తోంది. అయితే, ధ్రువపత్రాల పరిశీలనలో క్రీడా సంఘాలు తీవ్ర జాప్యం చేస్తుండటంతో అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ సమస్యకు పరిష్కారంగా క్రీడా ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను ఇకపై పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. దీనివల్ల సర్టిఫికెట్ల ధ్రువీకరణ వేగంగా పూర్తవడంతో పాటు, క్రీడా కోటా అభ్యర్థులకు అనవసర జాప్యం కారణంగా నష్టం కలగకుండా ఉంటుందని భావిస్తున్నారు.