
D Spiritual: Oct 15: నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో నాలుగో రోజు భ్రమరాంబికా దేవి కూష్మాండదుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు, శ్రీశైల మల్లికార్జున స్వామి, భ్రమరాంబికా అమ్మవార్ల గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.
ముందుగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై కూష్మాండదుర్గ అలంకారంలో ఉన్న అమ్మవారిని వివిధ పుష్పాలు, ఆభరణాలతో అలంకరించారు. అనంతరం అర్చకులు, వేదపండితులు వేదమంత్రాల నడుమ బిల్వదళాలతో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. సుగంధ ద్రవ్యాలతో ధూపదీప నైవేద్యాలు సమర్పించి మంగళహారతులు ఇచ్చారు.
అనంతరం శ్రీ భ్రమరాంబికా దేవి, మల్లికార్జున స్వామివార్ల ఉత్సవమూర్తులను కైలాస వాహనంపై ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కర్పూర హారతులు సమర్పించిన తర్వాత స్వామి, అమ్మవార్ల గ్రామోత్సవాన్ని వైభవంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నాదస్వరం, కేరళ చండీమేళం, కొమ్ము కోయ నృత్యం, కోలాటం, రాజభటుల వేషాలు, వివిధ కళారూపాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఆలయ ప్రాంగణం నుంచి భాజాభజంత్రీలు, బ్యాండ్ వాయిద్యాల నడుమ స్వామి, అమ్మవార్ల గ్రామోత్సవం కొనసాగింది. పురవీధుల్లో ఊరేగింపుగా వస్తున్న ఉత్సవమూర్తులను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు స్వామి, అమ్మవార్లకు కర్పూర నీరాజనాలు సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు. దీంతో శ్రీశైల క్షేత్రంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు దంపతులు, ట్రస్టు బోర్డు సభ్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
