D Spiritual: Oct 11: తిరుమలలో నేటి నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు

ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో శ్రీవారి వార్షిక నవరాత్రి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈరోజు రాత్రి 7 గంటలకు సేనాధిపతి విష్వక్సేనుల వారి ఊరేగింపుతో ఉత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేయనున్నారు. అక్టోబర్ 20వ తేదీ వరకు కొనసాగనున్న ఈ బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

బ్రహ్మోత్సవాలకు వచ్చే సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. అక్టోబర్ 20వ తేదీ వరకు అన్ని రకాల ఆర్జిత సేవలతో పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. స్వయంగా విచ్చేసే ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా, వీఐపీ దర్శనాల కోసం ఎలాంటి సిఫార్సు లేఖలను స్వీకరించబోమని అధికారులు స్పష్టం చేశారు.

శ్రీవారి వాహన సేవల షెడ్యూల్

బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం 9 గంటలకు బంగారు తిరుచి ఊరేగింపు నిర్వహించనున్నారు. అదే రోజు రాత్రి 7 గంటలకు బ్రహ్మోత్సవాల్లో తొలి వాహన సేవగా పెద్దశేష వాహనంపై మలయప్ప స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. అక్టోబర్ 20వ తేదీ వరకు వివిధ వాహనాలపై స్వామివారు తిరుమల మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ

ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనం కోసం భక్తులు 16 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతోంది. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో రానున్న రోజుల్లో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది.

భక్తుల కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు

శనివారం ఒక్కరోజే 79,737 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, హుండీ ద్వారా రూ.3.71 కోట్ల ఆదాయం సమకూరింది. బ్రహ్మోత్సవాలకు భారీ సంఖ్యలో తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం తాగునీరు, అన్నప్రసాదం పంపిణీ, వైద్య సేవలు, భద్రత వంటి అంశాల్లో టీటీడీ పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించింది. భక్తులు అధికారుల సూచనలు పాటిస్తూ స్వామివారి వాహన సేవల్లో పాల్గొనాలని అధికారులు సూచిస్తున్నారు.