
D Spiritual: Oct 10: తిరుమలలో అన్నప్రసాద సేవకు రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా సర్వింగ్స్!
రోజూ లక్షలాది మంది భక్తులకు ఉచిత భోజనం.. అన్నపూర్ణ నిలయంగా శ్రీవారి క్షేత్రం
తిరుమల: “వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన” అన్న నానుడికి నిదర్శనంగా తిరుమల శ్రీవారి క్షేత్రం భక్తుల ఆకలి తీర్చే అన్నపూర్ణ నిలయంగా వెలుగొందుతోంది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ అందిస్తున్న నిత్య అన్నప్రసాద సేవ అక్షయపాత్రలా కొనసాగుతోంది. 2026 జనవరి 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు కేవలం తొమ్మిది నెలల్లోనే వివిధ కేంద్రాల ద్వారా 9 కోట్లకు పైగా అన్నప్రసాద సర్వింగ్స్ అందించారు. సాధారణ రోజుల్లో 1.80 లక్షల నుంచి 1.90 లక్షల మంది, రద్దీ రోజుల్లో 3 లక్షల మందికి పైగా భక్తులు అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు.
1985లో ప్రారంభమైన నిత్యాన్నదాన పథకం
తిరుమలలో నిత్యాన్నదాన పథకాన్ని 1985 ఏప్రిల్ 6న అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రారంభించారు. 1994 ఏప్రిల్ 1న దీనిని ట్రస్టుగా మార్చారు. ప్రస్తుతం శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టు ద్వారా ఈ సేవలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. భక్తుల విరాళాలతో నిర్వహిస్తున్న ఈ ట్రస్టు వద్ద రూ.2,900 కోట్లకు పైగా ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. వాటిపై వచ్చే ఆదాయంతో భక్తులకు ఉచితంగా నాణ్యమైన భోజనం అందిస్తున్నారు.
మూడు ప్రధాన వంటశాలల్లో ఆహార తయారీ
తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం, శ్రీ అక్షయ వంటశాల, వకుళమాత వంటశాలలు 24 గంటలూ పనిచేస్తున్నాయి. వీటి ద్వారా టిఫిన్లు, అన్నం, కూరలు, సాంబార్, రసం, మజ్జిగ, పెరుగన్నం, వివిధ రకాల రైస్ వంటకాలు, పానీయాలు తయారు చేసి భక్తులకు అందిస్తున్నారు. యాత్రికుల వసతి సముదాయాలు, ఇతర ముఖ్య ప్రాంతాలకు కూడా ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు.
క్యూలైన్లలోనూ నిరంతర అన్నప్రసాద వితరణ
శ్రీవారి దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉండే భక్తులకు ఇబ్బంది కలగకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు, పీఏసీ భవనాలు, ఇతర ప్రాంతాల్లో అన్నప్రసాదం, పానీయాలు పంపిణీ చేస్తున్నారు. పర్వదినాల్లో మజ్జిగ, బాదం పాలు, బిస్కెట్లు, జ్యూస్ ప్యాకెట్లను కూడా అందిస్తున్నారు. తిరుమలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ అనుబంధ ఆలయాల్లోనూ ఈ సేవలను కొనసాగిస్తున్నారు.
రోజూ 15.8 టన్నుల బియ్యం వినియోగం
లక్షలాది మందికి భోజనం అందించేందుకు టీటీడీ ప్రతిరోజూ భారీగా ముడిసరుకులను వినియోగిస్తోంది. రోజుకు సుమారు 15,788 కిలోల బియ్యం, 3,110 కిలోల సన్ఫ్లవర్ ఆయిల్, 2,861 కిలోల కందిపప్పుతో పాటు రవ్వలు, మినప్పప్పు, ఉప్పు, బెల్లం, చింతపండు, చక్కెర, ఇతర సరుకులను ఉపయోగిస్తున్నారు. అన్నప్రసాదాల తయారీకి రోజుకు సుమారు 4,375 కొబ్బరికాయలు కూడా వినియోగిస్తున్నారు.
సిబ్బంది, శ్రీవారి సేవకుల సమష్టి కృషి
అన్నప్రసాద సేవలను మరింత విస్తరించేందుకు టీటీడీ ఆధునిక వంటశాలలు, ఆహార పంపిణీ వ్యవస్థలను అందుబాటులోకి తెస్తోంది. పీఏసీ-5లో ఒకేసారి 1,500 మంది భోజనం చేసే సదుపాయం కల్పించింది. రోజుకు 2 లక్షల మందికి సరిపడా ఆహారం తయారు చేయగల సామర్థ్యంతో వంటశాలలను అభివృద్ధి చేస్తోంది. ఈ సేవల్లో వెయ్యి మందికి పైగా సిబ్బందితో పాటు మరో వెయ్యి మంది శ్రీవారి సేవకులు నిరంతరం పాల్గొంటున్నారు.
శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు కడుపునిండా భోజనం చేసి తృప్తిగా స్వామివారిని దర్శించుకోవాలన్న సంకల్పంతో టీటీడీ అన్నప్రసాద సేవలను కొనసాగిస్తోంది. ఆకలితో వచ్చిన భక్తుడికి అన్నం అందించడం ద్వారా సేవాభావం, మానవత్వం, సనాతన సంప్రదాయాల గొప్పతనాన్ని చాటుతోంది.
