
D Educt: Oct 8: విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించిన విద్యార్థులు భారత్‌లో ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (ఎఫ్ఎంజీఈ)కు హాజరయ్యేందుకు కీలక అర్హత ఉండాలని జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) స్పష్టం చేసింది. తాము వైద్య విద్యను పూర్తి చేసిన దేశంలో వైద్య వృత్తిని నిర్వహించేందుకు అవసరమైన లైసెన్సు లేదా రిజిస్ట్రేషన్ కలిగి ఉన్నవారే భారత్‌లో ఎఫ్ఎంజీఈ పరీక్షకు అర్హులని తెలిపింది.
విదేశాల్లో కేవలం పర్యవేక్షణలో పనిచేస్తున్న జూనియర్ డాక్టర్‌గా ఉండటం మాత్రమే సరిపోదని ఎన్ఎంసీ పేర్కొంది. ముఖ్యంగా జార్జియాలో ఆరేళ్ల ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు భారత్‌లో ఎఫ్ఎంజీఈ పరీక్షకు హాజరయ్యే అర్హతపై స్పష్టత కోరుతూ ఓ విద్యార్థిని పీఎం గ్రీవెన్స్ పోర్టల్‌లో ప్రశ్నను లేవనెత్తింది. దీనికి ఎన్ఎంసీ ఈ మేరకు సమాధానం ఇచ్చింది.
విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారు భారత్‌లో వైద్య వృత్తిని చేపట్టాలంటే ఎఫ్ఎంజీఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి. అయితే, ఏదైనా విదేశీ దేశంలో వైద్య విద్యను పూర్తి చేసిన అభ్యర్థి, ఆ దేశ పౌరులతో సమానంగా వైద్యుడిగా రిజిస్ట్రేషన్ పొందినప్పుడే లేదా వైద్య వృత్తి నిర్వహించేందుకు అవసరమైన లైసెన్సు కలిగి ఉన్నప్పుడే భారత్‌లో ఎఫ్‌ఎంజీఈకి హాజరయ్యేందుకు అర్హుడని ఎన్ఎంసీ వివరించింది.
జాతీయ మెడికల్ కమిషన్ (విదేశీ వైద్య గ్రాడ్యుయేట్ లైసెన్షియేట్) నిబంధనలు-2021లో ఇదే విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నట్లు ఎన్ఎంసీ తెలిపింది. విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించే విద్యార్థులు కోర్సులో చేరే ముందు ఆయా దేశాల్లో వైద్య వృత్తికి సంబంధించిన రిజిస్ట్రేషన్, లైసెన్సింగ్ నిబంధనలను తప్పనిసరిగా తెలుసుకోవాలని సూచించింది.
