D NEWS: మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని 24 వార్డుల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన కోసం రూ.15 కోట్ల UIDF నిధులు మంజూరయ్యాయి. ఈ నేపథ్యంలో మంత్రి గడ్డం వివేక్ బుధవారం 14వ వార్డులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను దశలవారీగా కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. మందమర్రి పట్టణంలో సుమారు రూ.40 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను త్వరలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు అమృత్ పథకం ద్వారా ఇంటింటికీ నల్లా కనెక్షన్లు అందించే కార్యక్రమం కొనసాగుతోందని వివేక్ తెలిపారు. పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు సీసీ మరుగు కాలువల నిర్మాణానికి కూడా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

మందమర్రి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తానని మంత్రి చెప్పారు. అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాయలింగు, పట్టణ అధ్యక్షుడు మంద తిరుమల్ రెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పైడిమల్ల నర్సింగ్, పార్టీ నాయకులు, మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.