D NEWS: ప్రతి పౌరుడికి జీవించే హక్కుతో పాటు ఓటు హక్కు కూడా అత్యంత ముఖ్యమని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఓటు హక్కును కాలరాయడం ప్రజాస్వామ్యానికి నష్టం కలిగించడమేనని పేర్కొన్నారు.

మక్తల్‌లోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. మక్తల్ నియోజకవర్గంలో సుమారు 70 వేల ఓట్లు తొలగించారని ఆయన ఆరోపించారు. ప్రతి వ్యక్తి తన ఓటు హక్కును కోల్పోకుండా చూడాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా శాంతియుత నిరసనలకు పిలుపునిచ్చారని తెలిపారు.

ఎన్నికల సంఘం తీరుపై విపక్షాలు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలపై ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని వాకిటి శ్రీహరి అన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో నిరసనలను అణచివేసే ప్రయత్నాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.

ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలిపిన రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని మంత్రి ఖండించారు. ఓటర్ల జాబితా సవరణపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, అభ్యంతరాలపై ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వాలని కోరారు.

ఓటు హక్కు పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని వాకిటి శ్రీహరి తెలిపారు. ప్రజల ఓటు హక్కు కాపాడే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.