D NEWS: దసరా, దీపావళి పండుగల ముందు ప్రజలకు శుభవార్త వస్తుందని ఎదురుచూస్తున్న సమయంలో విద్యుత్ ఛార్జీల రూపంలో భారీ భారం మోపుతున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. ప్రజలపై రూ.5,420 కోట్ల విద్యుత్ భారం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమైందని ఆయన ఆరోపించారు.

తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి వ్యవసాయేతర విద్యుత్ వినియోగదారుల నుంచి రూ.5,420.23 కోట్ల ట్రూ-అప్ ఛార్జీలను వసూలు చేసేందుకు అనుమతించింది. ఈ వసూళ్లు నవంబర్ 2026 బిల్లుల నుంచి ప్రారంభం కానున్నాయి.

కరువు, ఎల్‌నినో ప్రభావం, పెరిగిన నిత్యావసరాల ధరలతో ప్రజలు ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హరీశ్ రావు అన్నారు. ఇలాంటి సమయంలో విద్యుత్ ఛార్జీల పేరుతో అదనపు భారం మోపడం సరికాదని విమర్శించారు.

ప్రజలపై మోపనున్న విద్యుత్ భారాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. పెంచిన ఛార్జీలను తగ్గించాలని బీఆర్‌ఎస్ తరఫున కోరుతున్నట్లు తెలిపారు. విద్యుత్ రంగానికి సంబంధించిన నిర్ణయాల్లో ప్రజలపై పడే ఆర్థిక భారాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు.

వ్యవసాయ రంగానికి సంబంధించిన రూ.2,214.99 కోట్ల ట్రూ-అప్ మొత్తాన్ని ప్రభుత్వం భరించాలని TGERC స్పష్టం చేసింది. మిగిలిన రూ.5,420.23 కోట్లను ఇతర అర్హత కలిగిన విద్యుత్ వినియోగదారుల నుంచి వసూలు చేయనున్నారు.