D NEWS: ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి సమీపంలో ఓపెన్‌కాస్ట్ బొగ్గు గని ఏర్పాటు ప్రతిపాదనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆలయ పరిసరాల్లో తవ్వకాలు, బ్లాస్టింగ్ చేపడితే చారిత్రక కట్టడానికి, రామప్ప చెరువుకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

రామప్ప ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిందని కేటీఆర్ పేర్కొన్నారు. ఇలాంటి వారసత్వ కట్టడం సమీపంలో భారీ స్థాయిలో తవ్వకాలు చేపట్టడం వల్ల కలిగే ప్రభావాలపై సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని అన్నారు.

రామప్ప ఆలయానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలోని వెంకటాపురం గ్రామం వద్ద ఓపెన్‌కాస్ట్ గని ప్రతిపాదనపై ఇప్పటికే అధికారులు అధ్యయనం చేస్తున్నారు. గనికి సంబంధించిన ప్రతిపాదనపై శాస్త్రీయ అధ్యయనాలు, పర్యావరణ భద్రత, వారసత్వ పరిరక్షణ అంశాలను పరిశీలించిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటామని ములుగు జిల్లా అధికారులు గతంలో వెల్లడించారు.

రామప్ప ఆలయం, చెరువుకు ఎలాంటి హాని కలిగించే చర్యలు చేపట్టకూడదని కేటీఆర్ డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తోందని స్పష్టం చేస్తూ, ఓపెన్‌కాస్ట్ గని ఏర్పాటు నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు.

ప్రభుత్వం ప్రతిపాదనను ఉపసంహరించుకోకపోతే ఉద్యమం చేపడతామని కేటీఆర్ హెచ్చరించారు. ఇదే అంశంపై మాజీ ఎంపీ బి. వినోద్ కుమార్ కూడా గని ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని కోరారు.