
D Spiritual: Oct 6: నవరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ కీలక అప్‌డేట్ ప్రకటించింది. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు, తమిళుల పవిత్ర పెరటాసి మాసం రద్దీని దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా పలు నిర్ణయాలు తీసుకుంది.
ఈ క్రమంలో నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా అక్టోబర్ 12, 13, 14, 18, 19, 20 తేదీలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను అక్టోబర్ 7న ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
అక్టోబర్ 7న రూ.300 దర్శనం టికెట్లు
అక్టోబర్ 7 బుధవారం ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది. శ్రీవారి దర్శనం కోసం టికెట్లు బుక్ చేసుకునే భక్తులు టీటీడీ అధికారిక ఆన్‌లైన్ వేదికను మాత్రమే ఉపయోగించాలని అధికారులు సూచించారు.
నకిలీ వెబ్‌సైట్లను నమ్మి మోసపోవద్దని భక్తులను టీటీడీ హెచ్చరించింది. టికెట్ల బుకింగ్‌కు అధికారిక మార్గాలను మాత్రమే వినియోగించాలని స్పష్టం చేసింది.
10 రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
నవరాత్రి బ్రహ్మోత్సవాలతో పాటు పెరటాసి మాసం చివరి వారం కూడా రావడంతో తిరుమలలో భారీగా భక్తుల రద్దీ ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సామాన్య భక్తులకు వేగంగా దర్శనం కల్పించేందుకు టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది.
అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా మిగిలిన అన్ని రకాల వీఐపీ బ్రేక్ దర్శనాలను తాత్కాలికంగా రద్దు చేసింది. అదే సమయంలో వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, ఎన్‌ఆర్‌ఐలు, డిఫెన్స్ సిబ్బందికి సంబంధించిన ప్రత్యేక దర్శనాలను కూడా ఈ కాలంలో నిలిపివేయనున్నట్లు టీటీడీ తెలిపింది.
సిఫార్సు లేఖల స్వీకరణకు కూడా బ్రేక్
వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసిన నేపథ్యంలో అక్టోబర్ 10 నుంచి 19వ తేదీ వరకు ఎలాంటి సిఫార్సు లేఖలను స్వీకరించబోమని టీటీడీ స్పష్టం చేసింది. సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్శనం కల్పించడమే ఈ నిర్ణయాల ప్రధాన ఉద్దేశమని తెలిపింది.
నవరాత్రి బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున భక్తులు ముందుగానే తమ యాత్రను ప్లాన్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. దర్శనం టికెట్లు, వసతి తదితర ఏర్పాట్లను ముందుగానే చేసుకోవడం ద్వారా ఇబ్బందులు లేకుండా తిరుమల యాత్రను పూర్తి చేసుకోవచ్చని పేర్కొంది.
