D NEWS: తెలంగాణలో త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రధాన రాజకీయ పార్టీల్లో కసరత్తు మొదలైంది. హైదరాబాద్–మహబూబ్‌నగర్–రంగారెడ్డి, వరంగల్–నల్గొండ–ఖమ్మం గ్రాడ్యుయేట్ స్థానాల్లో గెలుపు కోసం పార్టీలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి.

అధికార కాంగ్రెస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ప్రచారాన్ని ప్రారంభించగా, బీఆర్ఎస్, బీజేపీలు తమ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. ఈ ఎన్నికలను రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కీలక రాజకీయ పరీక్షగా పార్టీలు భావిస్తున్నాయి.

వరంగల్–నల్గొండ–ఖమ్మం గ్రాడ్యుయేట్ స్థానానికి జనసేన అభ్యర్థిగా మాజీ వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావును ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. దీంతో బీజేపీ–జనసేన మధ్య ఎమ్మెల్సీ ఎన్నికల్లో పొత్తు ఉంటుందా అనే చర్చ మొదలైంది.

ఈ అంశంపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు స్పందించారు. జనసేన తమకు భాగస్వామ్య పార్టీ అని, వరంగల్ స్థానానికి అభ్యర్థిని ప్రకటించిన జనసేనతో మాట్లాడుతామని తెలిపారు. ఇరు పార్టీల మధ్య కోఆర్డినేషన్, కోఆపరేషన్‌తో ముందుకు వెళ్తామని చెప్పారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ, పొత్తుపై జనసేన తమను సంప్రదిస్తే చర్చించి నిర్ణయం తీసుకుంటామని రామచందర్ రావు తెలిపారు. వరంగల్ స్థానంలో గతంలో బీజేపీ గెలిచిన చరిత్ర ఉందని, ఈ స్థానంలో పోటీ చేయడానికి తమ పార్టీ నేతలు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. దీంతో ఎన్నికల నాటికి బీజేపీ–జనసేన మధ్య ఎలాంటి సమన్వయం ఏర్పడుతుందనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.