
D News :సెలబ్రిటీలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను AIతో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడం రోజురోజుకూ ఆందోళన కలిగిస్తోంది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ నటించిన ‘దేవర’ సినిమాలోని సూపర్‌హిట్ సాంగ్ ‘చుట్టమల్లె’కు సంబంధించిన ఓ అభ్యంతరకరమైన AI మార్ఫింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం కలకలం రేపింది.
ఈ విషయం ఎన్టీఆర్ దృష్టికి రావడంతో ఆయన తీవ్రంగా స్పందించారు. వీడియోను రూపొందించిన వారితో పాటు దాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు.
‘ఇది చాలా సిగ్గుచేటు’.. ఎన్టీఆర్ ఆగ్రహం
మహిళలను గౌరవించడం భారతీయ సంస్కృతిలో ఎంతో ముఖ్యమైన విషయమని పేర్కొన్న ఎన్టీఆర్.. ఒక మహిళను అవమానించేలా AI టెక్నాలజీని ఉపయోగించడం అత్యంత దారుణమని అన్నారు.
ఇలాంటి అసభ్యకరమైన కంటెంట్‌ను రూపొందించడం వెనుక ఉన్న వారిని వదిలిపెట్టేది లేదని ఆయన హెచ్చరించారు. వీడియోను తయారు చేసిన వారిపై మాత్రమే కాకుండా.. దాన్ని ఇతరులకు పంపుతూ, సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటానని తెలిపారు.
‘ఎవరూ చూడొద్దు.. షేర్ చేయొద్దు’
ఈ తరహా డీప్‌ఫేక్ వీడియోలను ఎవరూ చూడొద్దని, వాటిని షేర్ చేయడం లేదా ఎంగేజ్ అవ్వడం ద్వారా మరింత ప్రచారం చేయొద్దని ఎన్టీఆర్ ప్రజలను కోరారు.
ఈరోజు ఇలాంటి ఘటన మరొకరికి ఎదురైతే.. భవిష్యత్తులో ఇదే పరిస్థితి మన కుటుంబంలోని మహిళలకు కూడా ఎదురయ్యే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. అందుకే ఇలాంటి కంటెంట్‌ను ప్రోత్సహించకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
AI దుర్వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలి
AI టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్న ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశంపై మరింత కఠినంగా వ్యవహరించాలని ఎన్టీఆర్ కోరారు. ఇలాంటి డీప్‌ఫేక్ కంటెంట్‌ను తయారు చేసే వారిని, ప్రచారం చేసే వారిని అడ్డుకునేలా కఠినమైన నిబంధనలు తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఎన్టీఆర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఇలాంటి డీప్‌ఫేక్‌ల వల్ల సెలబ్రిటీలతో పాటు సాధారణ వ్యక్తుల గౌరవం, వ్యక్తిగత హక్కులకు కూడా ముప్పు ఏర్పడే అవకాశం ఉందన్న చర్చ మరోసారి మొదలైంది.
