
D Educt: Oct 3: ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం సమాన హోదా కల్పించింది. రాష్ట్రపతి ఉత్తర్వులు-2025 అమల్లో భాగంగా ప్రభుత్వ, జడ్పీ యాజమాన్యాల ప్రధానోపాధ్యాయుల పోస్టులను జోనల్ క్యాడర్‌గా వర్గీకరించింది. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల పోస్టుల క్యాడర్లను విభజిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
స్కూల్ అసిస్టెంట్, ఆదర్శ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఎస్జీటీ, ఆర్ట్, క్రాఫ్ట్, డ్రాయింగ్, మ్యూజిక్, వృత్తి విద్య ఇన్స్ట్రక్టర్ తదితర పోస్టులను జిల్లా క్యాడర్ పరిధిలోకి తీసుకొచ్చింది. అదే విధంగా ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయ గ్రేడ్-2 పోస్టులను జోనల్ పోస్టులుగా వర్గీకరించింది.
జిల్లా క్యాడర్ పోస్టులకు జిల్లా విద్యాధికారి నియామక అధికారిగా వ్యవహరించనున్నారు. జోనల్ క్యాడర్ పోస్టులకు ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (ఆర్జేడీ) నియామక అధికారులుగా ఉంటారు. కొత్త, పాత జిల్లాల మధ్య ఉపాధ్యాయులను సర్దుబాటు చేయనున్నారు. మొత్తం మంజూరైన పోస్టులు, ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని రిజర్వేషన్ నిబంధనల ప్రకారం టీచర్లను కొత్త జిల్లాలకు కేటాయించనున్నారు.
ప్రత్యేక కేటగిరీ టీచర్లకు మినహాయింపు
ప్రత్యేక కేటగిరీకి చెందిన ఉపాధ్యాయులకు సర్దుబాటు ప్రక్రియ నుంచి మినహాయింపు కల్పించనున్నారు. వితంతువులు, ఆటిజం, మేధో వైకల్యం, మానసిక రుగ్మత ఉన్న పిల్లల తల్లిదండ్రులు, 70 శాతానికి పైగా అంగవైకల్యం ఉన్నవారు, మూత్రపిండాల మార్పిడి, న్యూరో సర్జరీ, క్యాన్సర్ వంటి తీవ్రమైన దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ఈ మినహాయింపు వర్తించనుంది.
ప్రత్యేక కేటగిరీకి చెందిన ఉపాధ్యాయులను ఒకే జిల్లాలో కేంద్రీకరించకుండా అన్ని జిల్లాలకు సమానంగా కేటాయించేలా చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. తద్వారా సర్దుబాటు ప్రక్రియలో సమతుల్యత పాటించే అవకాశం ఉంటుంది.
ప్రయోగాత్మకంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో సర్దుబాటు
ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను ప్రయోగాత్మకంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో చేపట్టారు. అక్కడ మొత్తం 5,894 మంది ఎస్జీటీ తెలుగు ఉపాధ్యాయులు ఉన్నారు. వీరిని బాపట్ల జిల్లాకు 17.54 శాతం, గుంటూరు జిల్లాకు 30.18 శాతం, పల్నాడు జిల్లాకు 52.28 శాతం చొప్పున కేటాయించనున్నారు.
ప్రస్తుతం ఉపాధ్యాయుల్లో వివిధ వయసులు, సీనియారిటీ స్థాయులు ఉన్నందున కొత్త జిల్లాల కేటాయింపులో వయసు, సీనియారిటీ మధ్య సమతుల్యత పాటించాలని అధికారులు భావిస్తున్నారు. సీనియర్లు, జూనియర్లను సమన్వయంతో కొత్త జిల్లాలకు కేటాయించేలా సర్దుబాటు ప్రక్రియను చేపట్టనున్నారు.
మున్సిపల్ టీచర్లకు నాలుగు క్యాడర్లు
మున్సిపల్ ఉపాధ్యాయుల క్యాడర్‌కు సంబంధించిన ఉత్తర్వులు ఇంకా విడుదల కావాల్సి ఉంది. మున్సిపల్ టీచర్లను నాలుగు రకాల క్యాడర్లుగా వర్గీకరించనున్నట్లు సమాచారం. ఇందులో ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు జిల్లా స్థాయి క్యాడర్లో ఉండగా, ప్రధానోపాధ్యాయుల పోస్టులు జోనల్ స్థాయిలో ఉండనున్నాయి.
విశాఖపట్నం మహానగరపాలక సంస్థ, విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఆయా నగరపాలక సంస్థల పరిధిలోనే కొనసాగనున్నారు. మిగతా మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను జిల్లా క్యాడర్ పరిధిలో సర్దుబాటు చేయనున్నారు. అంటే అదే జిల్లాలోని మున్సిపాలిటీల మధ్య, కార్పొరేషన్ల మధ్య ఉపాధ్యాయుల బదిలీ లేదా కేటాయింపు జరిగే అవకాశం ఉంది. ప్రధానోపాధ్యాయ గ్రేడ్-2 పోస్టులకు మాత్రం జోనల్ స్థాయిలో సర్దుబాటు ఉంటుంది.
డీఎస్సీ నోటిఫికేషన్లో జాప్యం?
మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 15న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని పాఠశాల విద్యాశాఖ భావించింది. అయితే రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం కొత్త, పాత జిల్లాల మధ్య ఉపాధ్యాయుల సర్దుబాటు పూర్తి చేయాల్సి ఉండటంతో నోటిఫికేషన్లో కొంత జాప్యం జరిగే అవకాశం కనిపిస్తోంది.
ఉపాధ్యాయుల సర్దుబాటు పూర్తయిన తర్వాత జిల్లాల వారీగా ఖాళీ పోస్టులపై స్పష్టత రానుంది. ఇందుకు సంబంధించి ఆర్థికశాఖ నుంచి ఉత్తర్వులు జారీ కావాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాకు మంజూరైన పోస్టులు, ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయుల సంఖ్య, ఖాళీలను పరిగణనలోకి తీసుకుని వాటిని కొత్త జిల్లాలకు సర్దుబాటు చేయనున్నారు.
పనిచేస్తున్న ఉపాధ్యాయులతో పాటు ఖాళీ పోస్టులను కూడా కొత్త జిల్లాలకు కేటాయించిన తర్వాత జిల్లాల వారీగా ఖాళీల సంఖ్యపై స్పష్టత వస్తుంది. ఈ ప్రక్రియ పూర్తయిన అనంతరం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. దీంతో ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ కంటే సుమారు 10 నుంచి 15 రోజులు నోటిఫికేషన్ ఆలస్యం కావచ్చని శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.
