Hanuman Ansh: Hombale Films Announces October 9 Telugu Release for the Blockbuster Spiritual Drama

D News: చిన్న బడ్జెట్‌తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తున్న ‘హనుమాన్ అంశ్’ ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా గురించి టాలీవుడ్‌లో ఆసక్తి నెలకొనగా.. తెలుగు రిలీజ్‌పై ఉన్న సందిగ్ధతకు తాజాగా తెరపడింది.

అక్టోబర్ 9న తెలుగు రిలీజ్

ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ ఈ సినిమాను తెలుగులో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 9న ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్ థియేటర్లలోకి రానుంది.

వాస్తవానికి ఈ సినిమా తెలుగు వెర్షన్ సెప్టెంబర్ 18న విడుదల కావాల్సి ఉంది. అయితే రిలీజ్‌కు సంబంధించిన కొన్ని పరిణామాలతో సినిమా వాయిదా పడింది. ముఖ్యంగా తెలుగు రిలీజ్ బాధ్యతల నుంచి త్రివిక్రమ్ శ్రీనివాస్ తప్పుకోవడం, హైదరాబాద్‌లో జరగాల్సిన తెలుగు టీజర్ లాంచ్ కార్యక్రమం రద్దు కావడంతో అప్పట్లో విడుదలపై క్లారిటీ లేకుండా పోయింది.

తాజాగా హోంబలే ఫిలింస్ రంగంలోకి దిగి తెలుగు రిలీజ్ బాధ్యతలను తీసుకోవడంతో ఈ సినిమాపై మళ్లీ ఆసక్తి పెరిగింది.

రూ.2 కోట్ల సినిమాకు భారీ వసూళ్లు

నీమ్ కరోలి బాబా జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ ఆధ్యాత్మిక డ్రామాకు విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించారు. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను సాధించింది. 47 రోజుల్లోనే రూ.366 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల లెక్కలు వెల్లడిస్తున్నాయి.

హిందీలో ఇప్పటికే మంచి ఆదరణ దక్కించుకున్న ఈ సినిమా.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది. శోభినావ్ సత్య నీమ్ కరోలి బాబా పాత్రలో నటించిన ఈ డివైన్ డ్రామా అక్టోబర్ 9న థియేటర్లలోకి రానుంది.

By Avinash